ముంబై: చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్(HMPV) కేసులు భారత్‌లో నమోదవడంతో దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల అలజడి రేగింది. ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ విక్రయాలకు పాల్పడటంతో సోమవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా కుప్పకూలాయి. డిసెంబర్ క్వార్టర్ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపై ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఒత్తిడి పెంచాయి.
సెన్సెక్స్(Sensex) 1,258 పాయింట్లు పతనమై 78వేల స్థాయి దిగువన 77,965 వద్ద స్థిరపడింది. నిఫ్టీ(NIFTY) 24 వేల స్థాయిని కోల్పోయి 389 పాయింట్ల నష్టంతో 23,616 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. మెటల్, బ్యాంకులు, రియల్ ఎస్టేట్, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఫైనాన్స్ షేర్లు భారీగా నస్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,441 పాయింట్లు క్షీణించి 77,782 వద్ద, నిఫ్టీ 453 పాయింట్లు పతనమై 23,552 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3%, మిడ్ క్యాప్ సూచీ 2.50 శాతం పతనాన్ని చవిచూశాయి. హెచ్‌ఎంపీవీ వ్యాప్తి భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
ఇదీ చదవండి: తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?
నష్టాలు ఎందుకంటే...
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.62 శాతానికి చేరుకోవడంతో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు తాజాగా భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ 200 రోజుల మూవింగ్ యావరేజీ(డీఎంఏ) స్థాయిని కోల్పోవడంతో దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల సునామీ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment