చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) భారత్‌లోకి అడుగుపెట్టింది. ఈ వైరస్‌కు సంబంధించిన రెండు కేసులను ఒకటి కర్ణాటకలో, మరొకటి గుజరాత్‌లో భారత ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్త విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ 50 వారంలో మొదటి ట్రేడింగ్ సెషన్‌ను భారీ నష్టాలతో ముగించాయి. కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో ఒక్కో సూచీ 1 శాతానికి పైగా పడిపోయింది.
30 షేర్ల సెన్సెక్స్ 1,258.12 పాయింట్లు లేదా 1.59 శాతం పతనమై 77,964.99 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 79,532.67 నుంచి 77,781.62 రేంజ్‌లో ట్రేడవుతోంది.
సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 388.70 పాయింట్లు లేదా 1.62 శాతం తగ్గి 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం నాడు 24,089.95 గరిష్ట స్థాయిని నమోదు చేయగా, రోజు కనిష్ట స్థాయి 23,551.90గా ఉంది.
నిఫ్టీ50లోని 50 స్టాక్‌లలో 43 స్టాక్‌లు నష్టాలను చవిచూశాయి. ట్రెంట్, టాటా స్టీల్, బీపీసీఎల్, ఎన్‌టిపిసి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 4.60 శాతం వరకు నష్టపోయిన టాప్ లూజర్స్. మరోవైపు అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హెచ్‌సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్ 1.94 శాతం వరకు లాభాలతో గ్రీన్‌లో ముగిసిన 7 షేర్లలో ఉన్నాయి.
మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్, ఇండియా VIX, 15.58 శాతం క్షీణించి 15.65 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీలు వరుసగా 2.70 శాతం, 3.20 శాతం చొప్పున క్షీణించడంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్‌మార్క్‌లను ప్రతిబింబించాయి.
అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి, నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్ అత్యంత దారుణంగా దెబ్బతింది. 4 శాతం నష్టపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.439 లక్షల కోట్లకు పడిపోయింది.
ఉదయం ఇలా..
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం ఉదయం ప్రారంభంలో లాభాల్లో ట్రేడయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడయింది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.77 శాతం ఎగబాకింది.
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.
ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
వారాంతాన(డిసెంబర్ 10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్‌లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్‌ఎస్‌బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రకటించనుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment