
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తాజాగా పర్యావరణహిత విద్యుత్ (గ్రీన్ ఎనర్జీ) వ్యాపార విభాగంలో దూకుడు మరింతగా పెంచింది. రెండు కంపెనీలతో జట్టు కట్టింది. జర్మనీకి చెందిన ఫొటోవోల్టెయిక్ సోలార్ వేఫర్ల తయారీ సంస్థ నెక్స్‌వేఫ్ జీఎంబీహెచ్‌లో తమ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ (ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్) వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఆర్‌ఐఎల్ తెలిపింది. ఇందులో భాగంగా 25 మిలియన్ యూరోలు (సుమారు రూ. 218 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది.
అటు, డెన్మార్క్‌కు చెందిన స్టీస్‌డాల్ సంస్థ నుంచి హైడ్రోలైజర్ల తయారీ టెక్నాలజీకి లైసెన్స్ తీసుకుంటున్నట్లు వివరించింది. ‘ఫొటోవోల్టెయిక్ తయారీలో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టే దిశగా నెక్స్‌వేఫ్‌లో పెట్టుబడులు తోడ్పడగలవు. ఇక స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యం.. వచ్చే 1 దశాబ్దకాలంలో 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను 1 డాలర్‌కు అందించాలన్న మా లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఉపయోగపడగలదు‘ అని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్ పెట్టుబడులతో ఉత్పత్తి, టెక్నాలజీల అభివృద్ధికి మరింత ఊతం లభించగలదని నెక్స్‌వేఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
రిలయన్స్ ఇటీవలే వరుసగా రెండు సంస్థల్లో కీలక వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో తాజా డీల్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నార్వేకు చెందిన సోలార్ ప్యానెల్ తయారీ సంస్థ ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆర్‌ఐఎల్ మరోవైపు షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్‌లో భాగమైన స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటాలను దక్కించుకుంది. రిలయన్స్ .. రాబోయే రోజుల్లో నాలుగు గిగా ఫ్యాక్టరీలు నెలకొల్పేందుకు అవసరమైన టెక్నాలజీ, నైపుణ్యాలకు తాజా డీల్స్ అన్నీ గణనీయంగా తోడ్పడనున్నాయి.
తగ్గనున్న ఉత్పత్తి వ్యయం..
స్టీస్‌డాల్‌తో భాగస్వామ్యం ద్వారా భారత్‌లో హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీకి అవసరమైన టెక్నాలజీ రిలయన్స్‌కు అందుబాటులోకి వస్తుంది. ఫ్యుయల్ సెల్స్ తయారీకి కావాల్సిన టెక్నాలజీ కోసం కూడా ఈ ఒప్పందాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్యావరణహిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎలక్ట్రోలైజర్లు ఉపయోగపడతాయి. ప్రస్తుత టెక్నాలజీలతో పోలిస్తే స్టీస్‌డాల్ సాంకేతికతతో ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గుతాయని రిలయన్స్ పేర్కొంది. ప్రస్తుతం 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్ రేటు 5 డాలర్లుగా ఉండగా.. రానున్న దశాబ్దకాలంలో దీన్ని 1 డాలర్ స్థాయికి తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.