న్యూఢిల్లీ: రికార్డు లాభాలతో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ మూడో త్రైమాసిక ఫలితాల (క్యూ3) సీజన్‌కు శుభారంభాన్నివ్వగా.. రెండో అతి పెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం ఆదాయం 20 శాతం ఎగిసినప్పటికీ ... నికర లాభం 30 శాతం క్షీణించింది. మరోవైపు, రూ.8,260 కోట్లతో రెండోసారి షేర్ల బైబ్యాక్ ప్రణాళికతో పాటు షేరుకి రూ. 4 చొప్పున ప్రత్యేక డివిడెండ్ చెల్లించ నున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన వార్షికంగా చూస్తే రెండంకెల స్థాయిలో 10.1 శాతం మేర క్యూ3లో వృద్ధి సాధించినట్లు ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలిల్ పరేఖ్ తెలిపారు. ‘చాలా మటుకు విభాగాలన్నీ మెరుగ్గా రాణిస్తున్నాయి. భారీ డీల్స్ దక్కించుకున్నాం. మరిన్ని కుదుర్చుకోనున్నాం.
ఇవన్నీ మరింత ధీమానిస్తున్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. ఫలితాలు వివరంగా చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వివరంగా చూస్తే.. నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 3,610 కోట్లకు పరిమితమైంది. 2017–18 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 5,129 కోట్లు. అటు ఆదాయం 20.3 శాతం పెరిగి రూ. 17,794 కోట్ల నుంచి రూ. 21,400 కోట్లకు చేరింది. మార్కెట్ వర్గాలు నికర లాభం రూ. 4,115 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశాయి. కీలకమైన డిజిటల్ వ్యాపార విభాగం 33.1 శాతం వృద్ధి సాధించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే.. నికర లాభం 12 శాతం క్షీణించింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో ఇది రూ. 4,110 కోట్లు. ఆదాయం 3.8 శాతం పెరిగింది. త్రైమాసికాల వారీగా చూస్తే.. రూపాయి మారకంలో ఆదాయం 3.8 శాతం పెరగ్గా, డాలర్ మారకంలో 2.3 శాతం వృద్ధి నమోదైంది.
2018–19కి సంబంధించిన గైడెన్స్‌ను కరెన్సీ విలువ స్థిరంగా ఉండే ప్రాతిపదికన 8.5–9 శాతానికి పెంచింది. ఇది 6–8 శాతంగా ఉండొచ్చ ని గతేడాది ఏప్రిల్‌లో కంపెనీ అంచనా వేసింది. ఇక తాజాగా ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ మాత్రం యథాతథంగా 22–24శాతంగా ఉంచింది. క్యూ3 లో ఆపరేటింగ్ మార్జిన్ సుమారు 110 బేసిస్ పాయింట్లు క్షీణించి 22.6 శాతంగా నమోదైంది. డిసెంబర్ క్వార్టర్‌లో 1.57 బిలియన్ డాలర్ల డీల్స్ దక్కించుకుంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో 4.7 బిలియన్ డాలర్ల డీల్స్ సాధించినట్లవుతుంది. రెండో త్రైమాసికంలో ఇన్ఫీ 2 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు దక్కించుకుంది.
బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్–షాను లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా మరోసారి నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. రెండో దఫా పదవీకాలం 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి దాకా ఉంటుంది. కొత్త సీఎఫ్‌వోగా నీలాంజన్ రాయ్ మార్చి 1 నుంచి బాధ్యతలు చేపడతారు. సీఈవో సలిల్ పరేఖ్‌కు రూ. 3.25 కోట్ల విలువ చేసే షేర్లు కేటాయించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. వివాదాస్పదమైన పనయాతో పాటు మరో రెండు అనుబంధ సంస్థలైన స్కావా, కాలిడస్ కొనుగోలుకు ఏ సంస్థా ముందుకు రాకపోవడంతో వీటి విక్రయ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది. ఈ ఏడాది మార్చికల్లా వీటి విక్రయం పూర్తి కాకపోవచ్చన్న అంచనాతో.. వాటికి సంబంధించిన తరుగుదల మొదలైనవి కూడా క్యూ3 ఫలితాల్లో చేర్చినట్లు పేర్కొంది.
డివిడెండ్‌కు రూ. 2,107 కోట్లు..
షేరు ఒక్కింటికి రూ.4 ప్రత్యేక డివిడెండ్ చెల్లింపుల కోసం ఇన్ఫీ సుమారు రూ.2,107 కోట్లు వెచ్చించనుంది. దీనికి రికార్డు తేదీ జనవరి 25 కాగా, చెల్లింపు తేదీ జనవరి 28. గతేడాది జూన్‌లో చెల్లించిన రూ. 2,633 కోట్ల డివిడెండ్‌తో పాటు తాజా స్పెషల్ డివిడెండ్, బైబ్యాక్ ఆఫర్ కూడా కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో నిర్దేశించుకున్నట్లుగా మొత్తం రూ.13,000 కోట్ల మేర షేర్‌హోల్డర్లకు చెల్లించినట్లవుతుందని ఇన్ఫీ తెలిపింది. 2019 జనవరి 9 నాటికి ఇన్ఫీలో ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూప్‌నకు 12.82% వాటాలు ఉన్నాయి.
బైబ్యాక్ రేటు@ రూ. 800..
ఇన్ఫోసిస్ మరోసారి షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. దేశీ ఎక్సే్ఛంజీల్లో ఓపెన్ మార్కెట్ మార్గంలో కొనుగోలు జరిపే షేర్లకు సంబంధించి ఒక్కో షేరుకు గరిష్టంగా రూ. 800 ధర నిర్ణయించింది. రూ.8,260 కోట్లతో షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికింద 10.32 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది 2018 డిసెంబర్ 31 నాటికి కంపెనీ పెయిడప్ క్యాపిటల్‌లో సుమారు 2.36 శాతంగా ఉంటుంది. అమెరికన్ డిపాజిటరీ షేర్లను (ఏడీఎస్) కూడా షేర్‌హోల్డర్లు.. ఈక్విటీ షేర్ల కింద మార్చుకుని, దేశీ ఎక్సే్చంజీల్లో బైబ్యాక్ ఆఫర్లో పాల్గొనవచ్చని ఇన్ఫీ తెలిపింది.
దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఇన్ఫోసిస్ 2017 డిసెంబర్‌లో తొలిసారి బైబ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో షేరు ఒక్కింటికి రూ. 1,150 చొప్పున మొత్తం 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసింది. ఇందుకోసం రూ.13,000 కోట్లు వెచ్చించింది. మూడు దశాబ్దాల కంపెనీ చరిత్రలో తొలిసారిగా ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌లో వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, క్రిష్ గోపాలకృష్ణన్ భార్య సుధా గోపాలకృష్ణన్ మొదలైన వారితో పాటు ఎల్‌ఐసీ కూడా షేర్లను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment