ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌ షురూ | Infosys'Rs 9,200 cr share buyback to open on June 25 | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌ షురూ

Published Thu, Jun 24 2021 6:26 AM | Last Updated on Thu, Jun 24 2021 8:37 AM

Infosys'Rs 9,200 cr share buyback to open on June 25 - Sakshi

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కి రెడీ అయ్యింది. ఈ నెల 25 నుంచి బైబ్యాక్‌ను ప్రారంభించనున్నట్లు తాజాగా వెల్లడించింది. షేరుకి రూ. 1,750 ధర మించకుండా చేపట్టనున్న షేర్ల కొనుగోలుకి రూ. 9,200 కోట్ల వరకూ వెచ్చించనుంది. ఇందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 14నే ఇన్ఫోసిస్‌ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తదుపరి వాటాదారులు సైతం ఈ నెల 19న జరిగిన 40వ వార్షిక సమావేశంలో అనుమతించారు. వెరసి ప్రణాళికలకు అనుగుణంగా ఈ వారాంతం నుంచి బైబ్యాక్‌కు శ్రీకారం చుడుతున్నట్లు కంపెనీ తెలిపింది.

1.23 శాతం వాటా: ఈ శుక్రవారం(25) నుంచి ప్రారంభించనున్న ఈక్విటీ బైబ్యాక్‌ను ఆరు నెలలపాటు కొనసాగించనున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది. 2021 డిసెంబర్‌ 24న ముగించనుంది.  బైబ్యాక్‌లో భాగంగా 5,25,71,248 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇది మార్చికల్లా నమోదైన  ఈక్విటీలో 1.23% వాటాకు సమానం.

కనీసం 50 శాతం...
ఈక్విటీ షేర్ల కొనుగోలుకి కేటాయించిన మొత్తంలో కనీసం 50 శాతాన్ని అంటే రూ. 4,600 కోట్లను ఇందుకు వినియోగించనున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలియజేసింది. బైబ్యాక్‌కు గరిష్ట ధర, కనీస పరిమాణం ఆధారంగా కనీసం 2,62,85,714 షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది.  బైబ్యాక్‌లో భాగంగా దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీల నుంచి ఓపెన్‌ మార్కెట్‌ కొనుగోళ్లను చేపట్టనుంది. ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు బైబ్యాక్‌ను వర్తింపచేయబోమని ఇన్ఫీ స్పష్టం చేసింది.  

2020లోనే..
2019–20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల కేటాయింపులను పెంచే ప్రణాళికలను ఇన్ఫోసిస్‌ ఆవిష్కరించింది. వీటిలో భాగంగా ఐదేళ్ల కాలంలో 85 శాతం ఫ్రీ క్యాష్‌ ఫ్లోను డివిడెండ్లు, బైబ్యాక్‌లకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో 2021 ఏప్రిల్‌లో కంపెనీ బోర్డు రూ. 15,600 కోట్లను చెల్లించేందుకు ప్రతిపాదించింది. ఫలితంగా రూ. 6,400 కోట్లను తుది డివిడెండుగా ఇన్ఫోసిస్‌ చెల్లించింది. మరో రూ. 9,200 కోట్లను ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు వినియోగించనుంది. ఇంతక్రితం 2019 ఆగస్ట్‌లోనూ ఇన్ఫోసిస్‌ బైబ్యాక్‌ను చేపట్టి 11.05 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 8,260 కోట్లను కేటాయించింది. కంపెనీ తొలిసారిగా 2017 డిసెంబర్‌లో రూ. 13,000 కోట్లతో బైబ్యాక్‌ను చేపట్టింది.

బైబ్యాక్‌ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేరు 0.6 శాతం బలహీనపడి రూ. 1,503 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement