ఎన్‌టీపీసీ షేర్ల బైబ్యాక్‌ @ రూ. 2,276 కోట్లు | NTPC announces share buyback worth rs 2,275 cr | Sakshi
Sakshi News home page

ఎన్‌టీపీసీ షేర్ల బైబ్యాక్‌ @ రూ. 2,276 కోట్లు

Published Tue, Nov 3 2020 5:49 AM | Last Updated on Tue, Nov 3 2020 5:49 AM

NTPC announces share buyback worth rs 2,275 cr - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ రూ. 2,276 కోట్ల విలువ చేసే షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సంస్థ బోర్డు సోమవారం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 115 చొప్పున మొత్తం 19.78 కోట్ల దాకా షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. దీనికోసం నవంబర్‌ 13 రికార్డు తేదీగా ఎన్‌టీపీసీ నిర్ణయించింది.  మరోవైపు, సీఎండీ గుర్‌దీప్‌ సింగ్‌ పదవీకాలాన్ని 2025 జూలై 31 దాకా పొడిగించే ప్రతిపాదనకు ఎన్‌టీపీసీ బోర్డు ఆమోదం తెలిపింది. 2021 ఫిబ్రవరి 4 నుంచి పొడిగించిన పదవీకాలం అమల్లోకి వస్తుంది. 2016 ఫిబ్రవరి 4న ఆయన ఎన్‌టీపీసీ చైర్మన్, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 1987లో ఎన్‌టీపీసీలో ఇంజనీర్‌ ట్రెయినీగా కెరియర్‌ ప్రారంభించిన గుర్‌దీప్‌ సింగ్‌ ఆ తర్వాత పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

క్యూ2లో నికర లాభం 8 శాతం డౌన్‌ ..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సుమారు 8 శాతం క్షీణించి రూ. 3,495 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో లాభం రూ. 3,788 కోట్లు. ఇక తాజా క్యూ2లో ఆదాయం రూ. 26,569 కోట్ల నుంచి రూ. 28,678 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో విద్యుదుత్పత్తి స్థూలంగా 61.64 బిలియన్‌ యూనిట్ల (బీయూ) నుంచి 67.67 బీయూకి పెరిగింది. సెప్టెంబర్‌ ఆఖరు నాటికి స్థాపిత సామర్థ్యం 57,106 మెగావాట్ల నుంచి 62,910 మెగావాట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో సగటున విద్యుత్‌ టారిఫ్‌ యూనిట్‌కు రూ. 3.86గా ఉన్నట్లు ఎన్‌టీపీసీ తెలిపింది.
సోమవారం బీఎస్‌ఈలో ఎన్‌టీపీసీ షేరు సుమారు రెండు శాతం పెరిగి రూ. 89.25 వద్ద క్లోజయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement