Privacy concern
-
ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల గోప్యతను పరిరక్షించడంలో పదే పదే విఫలమవుతున్న ఫేస్బుక్ కంపెనీకి 500 కోట్ల డాలర్ల జరిమానాను అమెరికాలోని ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’ విధించింది. ఇంత పెద్ద మొత్తంలో ఓ ఐటీ కంపెనీకి జరిమానా విధించడం ఇదే మొదటిసారి. 3–2 మెజారిటీతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానాకు ముగ్గురు రిపబ్లికన్ కమిషనర్లు మొగ్గుచూపగా, ఇద్దరు డెమోక్రటిక్ కమిషనర్లు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంతో జరిమానా విధిస్తూ చేసిన తీర్మానాన్ని ఎఫ్‌టీసీ సమీక్షకు పంపించింది. పౌర డివిజన్‌కు చెందిన న్యాయవిభాగం ఈ తీర్మానాన్ని సమీక్షించి తుది తీర్పును వెలువరిస్తుంది. అయితే ఈ విచారణకు ఎంతకాలం పడుతుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమంటున్నారు సంబంధిత వర్గాలు. 500 కోట్ల డాలర్ల జరిమానా అన్నది భారీ మొత్తం అయినప్పటికీ గతేడాది 3,600 కోట్ల డాలర్ల రెవెన్యూ సాధించిన కంపెనీకి అంత పెద్దదేమీ కాదని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇంత భారీ జరిమానా విధించినప్పటికీ దాని ప్రభావం షేర్లపై ఏమాత్రం కనిపించలేదు. 1.8 శాతం షేర్లు ఊపందుకున్నాయి. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం ‘కేంబ్రిడ్జి అనలిటికా’ సంస్థ వద్ద వెలుగు చూడడంతో ఎఫ్‌టీసీ ఏడాది క్రితమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరపున ఎన్నికల ప్రచారం కోసం ఈ అనలిటికా అనే సంస్థ పనిచేసింది. -
షియోమీ మొబైల్ కంపెనీకి భద్రత ముప్పు!
బీజీంగ్: అంతర్గత భద్రతకు ముప్పుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో చైనా మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ తగిన చర్యలు తీసుకుంటోంది. చైనా దేశస్తులు కాని కస్టమర్లకు సంబంధించిన డేటాను తమ సర్వర్ల నుంచి ఇతర దేశాల్లోని తమ సర్వర్లకు తరలించడానికి నిర్ణయం తీసుకుంది. కాలిఫోర్నియా, సింగపూర్ లోని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లకు డేటాను తరలించే పనిలో షియోమీ పడింది. ఈ తరలింపు కార్యక్రమం ఈ సంవత్సరం తొలినాళ్ల నుంచే ప్రారంభినట్టు, అక్టోబర్ చివరకల్లా పూర్తవుతుందని షియోమీ కంపెనీ వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా కొత్త మార్కెట్లలో వ్యాపారాన్ని విస్తరించామని, ఇప్పటికే సింగపూర్, తైవాన్ దేశాల్లో వెబ్ సైట్ స్పీడ్ పెరిగిన విషయాన్ని యూజర్లు గుర్తిస్తున్నారని కంపెనీ తెలిపింది. భారత్ విషయానికి వస్తే 200 శాతం యూజర్లు పెరిగినట్టు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. స్టాటిక్ పేజీల లోడ్ సంబంధించిన అంశంలో వేగం పెంచడానికి సరికొత్త అకమాయ్ గ్లోబల్ సీడీఎన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఊపయోగిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.