5 లక్షల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటా షేర్ అయింది (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్ల డేటాను ఫేస్‌బుక్, బ్రిటీష్ పొలిటికల్ కన్సల్టెన్సీ కేంబ్రిడ్జ్ అనలిటికాతో అక్రమంగా షేర్ చేసిందని వివాదం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. యూజర్ల డేటా షేరింగ్‌పై ఫేస్‌బుక్ కూడా తన తప్పును ఒప్పుకుంది. తాజాగా ఫేస్‌బుక్ విడుదల చేసిన గణాంకాల్లో భారతీయుల డేటా కూడా బయటపడింది. 5 లక్షల మంది భారతీయుల యూజర్ల డేటాను కూడా కేంబ్రిడ్జ్ అనలటికాతో షేర్ చేసినట్టు ఫేస్‌బుక్ బుధవారం ప్రకటించింది. అంతేకాక ఫేస్‌బుక్ షేర్ చేసిన యూజర్ల డేటా సంఖ్య కూడా పెరిగింది. అంతకముందు 5 కోట్ల మంది డేటా మాత్రమే కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్‌బుక్ షేర్ చేసిందని అంచనాలు వెలువడితే, ప్రస్తుతం 8.7 కోట్ల మంది యూజర్ల డేటా బట్టబయలు అయినట్టు తెలిసింది. యూజర్ల అనుమతి లేకుండా.. ఫేస్‌బుక్ నుంచి కేంబ్రిడ్జ్ అనలిటికా ఈ డేటాను అక్రమంగా పొంది, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, బ్రెగ్జిట్ ప్రచారంలో రాజకీయ నాయకుల లబ్ది కోసం వాడిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వివాదం సృష్టిస్తున్నాయి.
తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో మొత్తం 8.7 కోట్ల మంది యూజర్ల ఫేస్‌బుక్ డేటాను అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలిటికాతో షేర్ అయినట్టు నమ్ముతున్నామని ఫేస్‌బుక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మైక్ ష్రోఫెర్ అన్నారు. దీనిలో ఎక్కువగా అమెరికన్ల డేటానే ఉన్నట్టు తెలిపారు. అంతేకాక భారత రాజకీయ ప్రచారాల్లో కూడా కేంబ్రిడ్జ్ అనలిటికాతో పలు పార్టీల కోసం ఫేస్‌బుక్ డేటాను వాడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రిస్టోఫర్ వైలీ, విజిల్‌బ్లోయర్‌లు కూడా దీనిపై ట్వీట్లు కూడా చేశారు. ఈ ఆరోపణలు కూడా రుజువయ్యాయి. దాదాపు 5 లక్షల మంది భారతీయుల డేటాను కూడా తాము కేంబ్రిడ్జ్ అనలిటికాకు షేర్ చేసినట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ సంస్థ పేరెంట్ కంపెనీ, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 2003, 2012 కాలాల్లో జరిగిన ఆరు రాష్ట్ర ఎన్నికలు, 2009 సాధారణ ఎన్నికల్లో పలు పార్టీల కోసం ఈ డేటాను వాడిందని తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు కేంబ్రిడ్జ్ అనలిటికాకు ప్రధాన క్లయింట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా కంపెనీలు ప్రభావితం చేయాలని చూస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ఒకవేళ అవసరమైతే, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు సమన్లు కూడా జారీచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment