న్యూయార్క్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ రోజురోజుకి తీవ్ర ఇరకాటంలో కూరుకుపోతోంది. ఈ సోషల్ మీడియా దిగ్గజం ప్రజలు డేటాను అమ్మేస్తుందని డొనాల్డ్ ట్రంప్ మాజీ చీఫ్ స్ట్రాటజిస్ట్, కేంబ్రిడ్జ్ అనలిటికా మాజీ వైస్ ప్రెసిడెంట్ స్టీవ్ బన్నొన్ ఆరోపిస్తున్నారు. ఫైనాన్సియల్ టైమ్స్ న్యూస్‌పేపర్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అయితే ఫేస్‌బుక్ నుంచి తీసుకున్న డేటా మైనింగ్ పొలిటికల్ డేటా అనాలిటిక్స్‌లో వాడుతున్నారనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు.
‘ఫేస్‌బుక్ మీ వివరాలన్నింటిన్నీ ఉచితంగా తీసుకుంటోంది. భారీ మొత్తంలో మార్జిన్ల కోసం వాటిని విక్రయిస్తోంది. ఈ కారణంతోనే కంపెనీలు ఎక్కువ విలువతో ట్రేడవుతున్నాయి’ అని బన్నొన్ చెప్పారు. తర్వాత ఆ కంపెనీలు ఆల్గారిథమ్స్ రాసి, ప్రజల జీవితాన్ని నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా.. కోట్లాది మంది ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్ డేటాను కొనుగోలు చేసిన స్కీమ్ ఉన్నట్టు తనకు గుర్తులేదన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ డేటా విక్రయించబడుతుందని మాత్రం బన్నొన్ నొక్కి చెప్పారు. ఈ స్కాండల్‌పై స్పందించిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, తాము తప్పులు చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ అనలిటికాపై అమెరికాలో విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment