Steve Bannon
-
73 మందికి ట్రంప్ క్షమాభిక్ష
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా పదవి వీడడానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేశారు. అందరూ ఊహిస్తున్నట్టుగానే భారీగా కసరత్తు చేసి వైట్‌హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బ్యానెన్తో పాటు 73 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. మరో 70 మందికి శిక్షల్ని తగ్గించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన వారిలో స్టీవ్ బ్యానెన్ అత్యంత ముఖ్యుడు. అయితే తాను మాత్రం స్వీయ క్షమాభిక్షకి దూరంగా ఉన్నారు. తనని తాను క్షమించుకుంటే తప్పుల్ని ఒప్పుకున్నట్టవుతుందని భావించిన ట్రంప్ ఆ సాహసం చేయలేదని సమాచారం. కానీ కాంగ్రెస్ మాజీ సభ్యులు, రాప్ సింగర్లు, ఇతర సన్నిహితులు, తన కుటుంబానికి సన్నిహితులైన ఎందరికో క్షమాభిక్ష పెట్టారు. రష్యాతో గూఢచర్యం కేసులో దోషులుగా తేలిన వారిని కూడా ట్రంప్ క్షమించారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో జైల్లో ఉంటూ ఇంకా ఎక్కువ కాలం కాకుండానే స్టీవ్ బ్యానెన్కు విముక్తి కల్పించారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులు సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష ఇస్తుంటారు. కానీ దానికి భిన్నంగా ట్రంప్ ఈ క్షమాభిక్షలపై ప్రత్యేకంగా కసరత్తు చేశారు. బ్యానెన్తో పాటు మలేషియా వెల్త్ ఫండ్ కేసు నుంచి విముక్తి కల్పించడానికి ట్రంప్ ప్రభుత్వాన్ని లాబీయింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన ఎల్లియట్ బ్రాయిడా, తన అల్లుడు జేర్డ్ కుష్నర్ స్నేహితుడు, సైబర్ వేధింపుల కేసులో దోషి అయిన కెన్ కుర్సన్లను క్షమించారు. ఇలా ట్రంప్ అధ్యక్షుడిగా చివరి రోజు రికార్డు స్థాయిలో క్షమాభిక్షలు, శిక్ష తగ్గించడం వంటివి చేశారు. వెనెజులా వలసదారుల అప్పగింత నిలిపివేత ట్రంప్ ఆఖరినిమిషంలో వెనెజులా వలసదారులకి అండగా నిలిచారు. వేలాదిమంది వలసదారుల్ని వారి దేశానికి పంపకుండా అడ్డుకున్నారు. ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయులుగా ఉన్న వారి అప్పగింతను మరో 18 నెలల పాటు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్వర్వులపై సంతకం చేశారు. దీంతో లక్షా 45 వేల మందికి పైగా వెనెజులా వలసదారులు అమెరికాలో ఉండే అవకాశం లభించింది. వెనెజులా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నందున వారిని పంపడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. -
ఫేస్బుక్ మీ డేటాను అమ్మేస్తోంది..
న్యూయార్క్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ రోజురోజుకి తీవ్ర ఇరకాటంలో కూరుకుపోతోంది. ఈ సోషల్ మీడియా దిగ్గజం ప్రజలు డేటాను అమ్మేస్తుందని డొనాల్డ్ ట్రంప్ మాజీ చీఫ్ స్ట్రాటజిస్ట్, కేంబ్రిడ్జ్ అనలిటికా మాజీ వైస్ ప్రెసిడెంట్ స్టీవ్ బన్నొన్ ఆరోపిస్తున్నారు. ఫైనాన్సియల్ టైమ్స్ న్యూస్‌పేపర్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అయితే ఫేస్బుక్ నుంచి తీసుకున్న డేటా మైనింగ్ పొలిటికల్ డేటా అనాలిటిక్స్‌లో వాడుతున్నారనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు. ‘ఫేస్బుక్ మీ వివరాలన్నింటిన్నీ ఉచితంగా తీసుకుంటోంది. భారీ మొత్తంలో మార్జిన్ల కోసం వాటిని విక్రయిస్తోంది. ఈ కారణంతోనే కంపెనీలు ఎక్కువ విలువతో ట్రేడవుతున్నాయి’ అని బన్నొన్ చెప్పారు. తర్వాత ఆ కంపెనీలు ఆల్గారిథమ్స్ రాసి, ప్రజల జీవితాన్ని నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా.. కోట్లాది మంది ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్బుక్ డేటాను కొనుగోలు చేసిన స్కీమ్ ఉన్నట్టు తనకు గుర్తులేదన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ డేటా విక్రయించబడుతుందని మాత్రం బన్నొన్ నొక్కి చెప్పారు. ఈ స్కాండల్‌పై స్పందించిన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, తాము తప్పులు చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ అనలిటికాపై అమెరికాలో విచారణ కొనసాగుతోంది. -
ఫేస్బుక్ డేటా స్కామ్.. మరో బాంబు
న్యూయార్క్ : ఫేస్బుక్ సమాచార గోప్యత విషయంలో మరో బాంబు పేలింది. సోషల్ మీడియా దిగ్గజం ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెడుతుందని వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బన్నొన్ తెలిపారు . గురువారం ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ‘సందేహమే లేదు. ఫేస్బుక్ తన ఖాతాదారులా డేటాను అమ్మేసుకుంది. ఇది అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అందుకే దాని వ్యాపారం, మార్కెట్లో దాని షేర్ల విలువ ఇప్పుడు అంత స్థాయిలో ఉంది’ అని తెలిపారు. అయితే రాజకీయ సంబంధిత డేటా చోరీ అంశంపై మాత్రం తనకు స్పష్టత లేదని.. కాబట్టి ఆ అంశంపై స్పందించబోనని బన్నొన్ తెలిపారు. ఇక సదస్సు ముగిశాక బయటకు వచ్చిన ఆయన ది గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ ఎనలైటికా(ట్రంప్ ప్రచారం కోసం పనిచేసిన డేటా విశ్లేషణ సంస్థ) యూఎస్ ఓటర్ల డేటాను అమ్ముకుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కేంబ్రిడ్జ్ ఎనలైటికా(సీఏ) మాతృక సంస్థ ఎస్సీఎల్(బ్రిటన్‌కు చెందిన సంస్ధ) సుమారు 50 మిలియన్ల ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో బన్నొన్ హస్తం కూడా ఉందంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ట్రంప్ మాజీ కార్యదర్శి, కేంబ్రిడ్జ్ అనలైటికా మాజీ ఉపాధ్యక్షుడు అయిన బన్నొన్.. గతంలో ‘ఫైర్ అండ్ ఫ్యూరీ : ఇన్సైడ్ ద ట్రంప్ వైట్ హౌజ్’ పుస్తకం ద్వారా అధ్యక్ష భవన సమాచారాన్ని బహిర్గత పరచటంతోపాటు.. అవినీతి, అసమర్థత పాలన అంటూ అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. -
అతడికి మతిపోయింది.. నన్నేం పీకలేడు
వాషింగ్టన్ : వైట్‌హౌజ్ మాజీ ఉద్యోగి స్టీవ్ బన్నొన్ ఓ పుస్తకంలో చేసిన వ్యాఖ్యలు అమెరికాలో పెను కలకలమే రేపుతోంది. అధ్యక్షభవన సమాచారాన్ని బహిర్గత పరచటంతోపాటు.. అవినీతి, అసమర్థత పాలన అంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన తీవ్ర విమర్శలు పుసక్తంలో చేశారు. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ తనయుడు, ఓ రష్యన్ లాయర్‌తో భేటీ అయ్యారని.. అది ముమ్మాటికీ దేశవ్యతిరేక చర్యేనని బన్నోన్ అందులో పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్షాలు, బిలినియర్లు ట్రంప్ ను నిలదీయగా.. అధ్యక్షుడు ట్రంప్ స్పందించాల్సి వచ్చింది. ‘‘స్టీవ్ బన్నొన్ నన్ను, నా అధ్యక్ష పదవిని ఏం చేయలేడు. అతడి ఉద్యోగం మాత్రమే కాదు.. మతిని కూడా పొగొట్టుకున్నాడు. వాడొక పిచ్చోడు. వాడికి మైండ్ పోయింది. పట్టించుకోకండి’’ అంటూ ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ‘ఫైర్ అండ్ ఫ్యూరీ : ఇన్సైడ్ ద ట్రంప్ వైట్ హౌజ్’ అనే ఆ పుస్తకాన్ని బన్నోన్ అందించిన సమాచారం మేరకు మైకేల్ వోల్ఫ్ అనే జర్నలిస్ట్ ప్రచురిస్తున్నారు. ఇదే పుసక్తంలో ట్రంప్ నోటి నుంచి వచ్చిన కొన్ని సంచలన వ్యాఖ్యలను.. రష్యాతో ట్రంప్ కుటుంబం కొనసాగించిన సత్సంబంధాలు గురించి కూడా ఆయన ప్రస్తావించాడంట. వచ్చే వారమే ఆ పుసక్తం ముద్రణ కానుంది. కాగా, అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. ఏరి కోరి శ్వేతసౌధం ముఖ్య వ్యూహకర్తగా బన్నోన్ను నియమించుకున్న ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో మనీలాండరింగ్ ఆరోపణలు రావటంతో గత ఆగస్టులో ఆయనను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఎఫ్‌బీఐ నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. -
ట్రంప్ కు తలనొప్పులు మొదలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి చేపట్టక ముందే డొనాల్డ్ ట్రంప్ కు తలనొప్పులు మొదలయ్యాయి. శ్వేతసౌధం ముఖ్య వ్యూహకర్త స్టీవ్ బానన్ నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ 168 డెమోక్రాటిక్ చట్టసభ ప్రతినిధులు ట్రంప్ కు లేఖ రాశారు. శ్వేత జాతీయుల పక్షపాతిగా ముద్రపడిన స్టీవ్ బానన్ ను వైట్ హౌస్ ముఖ్య వ్యూహకర్తగా నియమించడం మంచిది కాదని పేర్కొన్నారు. కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన అమీ బెరాకు ఈ లేఖపై సంతకం చేశారు. ’బానన్ నియామాకాన్ని దేశం యావత్తు వ్యతిరేకిస్తోంది. పాలనలో వైట్ హౌస్ ముఖ్య వ్యూహకర్త పదవి చాలా కీలకమైంది. ఇటువంటి పదవిని కట్టబెట్టే ముందు దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. బానన్ నియామకాన్ని రద్దు చేయాలని గట్టిగా కోరుతున్నాం. అమెరికా విలువలకు కట్టుబడిన వారికే శ్వేతసౌధంలో పదవులు ఇవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. దీనికి భిన్నంగా బానన్ ఎంపిక జరిగింద’ని ట్రంప్ కు రాసిన లేఖలో డెమోక్రాటిక్ ప్రతినిధులు పేర్కొన్నారు. శ్వేతసౌధం ముఖ్య వ్యూహకర్తగా బానన్ ను నియమించడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ట్రంప్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. ఈ లేఖపై ట్రంప్ బృందం వెంటనే స్పందించలేదు.