ట్రంప్ కు తలనొప్పులు మొదలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి చేపట్టక ముందే డొనాల్డ్ ట్రంప్ కు తలనొప్పులు మొదలయ్యాయి. శ్వేతసౌధం ముఖ్య వ్యూహకర్త స్టీవ్ బానన్ నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ 168 డెమోక్రాటిక్ చట్టసభ ప్రతినిధులు ట్రంప్ కు లేఖ రాశారు. శ్వేత జాతీయుల పక్షపాతిగా ముద్రపడిన స్టీవ్ బానన్ ను వైట్ హౌస్ ముఖ్య వ్యూహకర్తగా నియమించడం మంచిది కాదని పేర్కొన్నారు. కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన అమీ బెరాకు ఈ లేఖపై సంతకం చేశారు.
’బానన్ నియామాకాన్ని దేశం యావత్తు వ్యతిరేకిస్తోంది. పాలనలో వైట్ హౌస్ ముఖ్య వ్యూహకర్త పదవి చాలా కీలకమైంది. ఇటువంటి పదవిని కట్టబెట్టే ముందు దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. బానన్ నియామకాన్ని రద్దు చేయాలని గట్టిగా కోరుతున్నాం. అమెరికా విలువలకు కట్టుబడిన వారికే శ్వేతసౌధంలో పదవులు ఇవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. దీనికి భిన్నంగా బానన్ ఎంపిక జరిగింద’ని ట్రంప్ కు రాసిన లేఖలో డెమోక్రాటిక్ ప్రతినిధులు పేర్కొన్నారు.
శ్వేతసౌధం ముఖ్య వ్యూహకర్తగా బానన్ ను నియమించడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ట్రంప్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. ఈ లేఖపై ట్రంప్ బృందం వెంటనే స్పందించలేదు.