
న్యూయార్క్ : ఫేస్‌బుక్ సమాచార గోప్యత విషయంలో మరో బాంబు పేలింది. సోషల్ మీడియా దిగ్గజం ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెడుతుందని వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బన్నొన్ తెలిపారు . గురువారం ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.
‘సందేహమే లేదు. ఫేస్‌బుక్ తన ఖాతాదారులా డేటాను అమ్మేసుకుంది. ఇది అమెరికాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అందుకే దాని వ్యాపారం, మార్కెట్‌లో దాని షేర్ల విలువ ఇప్పుడు అంత స్థాయిలో ఉంది’ అని తెలిపారు. అయితే రాజకీయ సంబంధిత డేటా చోరీ అంశంపై మాత్రం తనకు స్పష్టత లేదని.. కాబట్టి ఆ అంశంపై స్పందించబోనని బన్నొన్ తెలిపారు. ఇక సదస్సు ముగిశాక బయటకు వచ్చిన ఆయన ది గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ ఎనలైటికా(ట్రంప్ ప్రచారం కోసం పనిచేసిన డేటా విశ్లేషణ సంస్థ) యూఎస్ ఓటర్ల డేటాను అమ్ముకుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
కేంబ్రిడ్జ్ ఎనలైటికా(సీఏ) మాతృక సంస్థ ఎస్‌సీఎల్(బ్రిటన్‌కు చెందిన సంస్ధ) సుమారు 50 మిలియన్ల ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో బన్నొన్ హస్తం కూడా ఉందంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, ట్రంప్ మాజీ కార్యదర్శి, కేంబ్రిడ్జ్ అనలైటికా మాజీ ఉపాధ్యక్షుడు అయిన బన్నొన్.. గతంలో ‘ఫైర్ అండ్ ఫ్యూరీ : ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్ హౌజ్’ పుస్తకం ద్వారా అధ్యక్ష భవన సమాచారాన్ని బహిర్గత పరచటంతోపాటు.. అవినీతి, అసమర్థత పాలన అంటూ అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.