వాషింగ్టన్ : ఫేస్‌బుక్ డేటా చోరిపై అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను కాస్త సందిగ్థతలో పడేసే ప్రశ్నలే ఎదురయ్యాయి. వందల కొద్దీ ప్రశ్నలు సంధించిన అమెరికన్ చట్టసభ్యులు, వ్యక్తిగత సమాచారాన్ని జుకర్‌బర్గ్‌కు సంధించారు. గత రాత్రి ఎక్కడ నిద్ర పోయారని జుకర్‌బర్గ్‌ని సెనేటర్ డిక్ డర్బిన్ అడిగారు. ఆన్‌లైన్ డిజిటల్ ప్రైవసీపై విచారణ జరిపిన డర్బిన్, ఆ ప్లాట్‌ఫామ్‌పై చేరిన యూజర్ల వ్యక్తిగత సమాచార విషయంలో ఫేస్‌బుక్ పాత్ర ఏమిటో తెలుసుకోవడం కోసం, గత రాత్రి ఎక్కడ ఉన్నారో తెలుపడానికి మీరు సౌకర్యవంతంగానే ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. డర్బిన్ సంధించిన ప్రశ్నలకు కాస్త ఆందోళనకు గురైన జుకర్‌బర్గ్, ఎనిమిది సెకన్ల పాటు మౌనం వహించి, చివరికి తన వ్యక్తిగత సమాచారాన్ని చెప్పడానికి నిరాకరించారు. ఈ వారంలో ఎవరికైనా మెసేజ్ చేశారా? ఆ పేర్లను మీరు మాతో పంచుకోగలరా? అంటూ మరో డెమొక్రాట్ ప్రశ్నించారు. మళ్లీ కూడా జుకర్‌బర్గ్ సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి జుకర్‌బర్గ్ అసలు ఆసక్తి చూపించలేదు.
ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చారు. దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలపై ఆయన సెనేటర్లకు క్షమాపణ చెప్పారు. సెనేటర్లకు ఇచ్చిన బహిరంగ ప్రకటనలో, ఫేక్ న్యూస్, ద్వేషపూరిత ప్రసంగం, డేటా గోప్యత లేకపోవడం, 2016 ఎన్నికల్లో రష్యన్ సోషల్ మీడియా జోక్యం వంటి పలు అంశాలపై ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల సమాచారం లీక్ అయినందుకు బాధ్యత తానే అని జుకర్‌బర్గ్ ఒప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment