కాంగ్రెస్ ముందుకు రాబోతున్న జుకర్‌బర్గ్
వాషింగ్టన్ : ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెరికా కాంగ్రెస్ ముందుకు రాబోతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్‌పై స్పందించేందుకు ఆయన అమెరికా చట్ట సభ్యుల ముందుకు వస్తున్నారు. 2016 అమెరికా ఎన్నికలకు ముందుకు 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకున్నామని ఒప్పుకున్న జుకర్‌బర్గ్, కాంగ్రెస్ సభ్యుల నుంచి కఠిన ప్రశ్నలనే ఎదుర్కోబోతున్నారు. సెనేట్ జ్యుడిషియరీ, కామర్స్ కమిటీలు జుకర్‌బర్గ్‌ను మంగళవారం ప్రశ్నించనుండగా... హౌజ్ ఎనర్జీ అండ్ కామర్స్ కమిటీ బుధవారం ఆయన్ని ప్రశ్నించనుంది. భవిష్యత్తు ప్రణాళికలపై జుకర్‌బర్గ్ నుంచి వాగ్దానాలు తీసుకోవడానికి కూడా అమెరికా చట్టసభ్యులకు ఇది ఓ అవకాశంగా మారుతోంది. వినియోగదారుల గోప్యతను, ఎన్నికల సమగ్రతను కాపాడటం కోసం కొత్త నిబంధనలను రూపొందించడానికి కూడా చట్టసభ్యులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. అయితే కాంగ్రెస్ సభ్యులకు నాలుగు విషయాల్లో ఫేస్‌బుక్ సీఈవో తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సి ఉందని తెలుస్తోంది.
అవేమిటో ఓ సారి చూద్దాం...
2015 నుంచే కేంబ్రిడ్జ్ అనలిటికాకు యూజర్ల డేటాను షేర్ చేస్తున్నట్టు ఫేస్‌బుక్ ఒప్పుకుంది. కానీ ఆ సమయంలోనే ఈ సమాచారాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకురాలేదు?
ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి అమెరికన్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటప్పుడు, కంపెనీలకు ఎలాంటి సమాచారం అవసరం పడతాయి?
సోషల్ నెట్‌వర్క్‌పై సమాచారం ద్వారా అమెరికన్లు మోసగించబడలేదని చెప్పడానికి భవిష్యత్తులో ఫేస్‌బుక్ ఏం చేయబోతోంది?
అమెరికాలో పొలిటికల్ పొలరైజేషన్(రాజకీయ ధృవీకరణ)ను తగ్గించడానికి ఫేస్‌బుక్ ఎలా సాయపడనుంది?
Comments
Please login to add a commentAdd a comment