అమెరికా ఎన్నికల్లో మళ్లీ రష్యా జోక్యం ? | Facebook Bans 32 Pages Aimed At US Election Interference | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 1 2018 10:17 PM | Last Updated on Fri, Aug 24 2018 6:21 PM

Facebook Bans 32 Pages Aimed At US Election Interference - Sakshi

అమెరికాలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో  ఓటర్లను తప్పుదారి పట్టించడానికి ఫేస్‌బుక్‌ వేదికగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని ఆ సంస్థ గుర్తించింది. రాజకీయ ప్రచారాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 32 పేజీల అకౌంట్లను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగించింది. కేంబ్రిడ్జి ఎన్‌లైటికా వ్యవహారంతో తలబొప్పి కట్టిన ఫేస్‌బుక్‌ అమెరికా ఎన్నికల్లో విదేశీ జోక్యం నివారించడానికి ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఆర్మ్స్‌ రేస్‌ పేరుతో రాజకీయపరమైన ట్రాల్స్‌ను ఇప్పటికే ఫేస్‌బుక్‌ జల్లెడ పడుతోంది. ఫేస్‌బుక్‌ తొలగించిన ఆ 32 పేజీలలో ప్రధానంగా వామపక్ష భావజాలపరమైన అంశాలు, జాతి వివక్ష, లింగ వివక్షల్ని రెచ్చగొట్టే అంశాలు, వలసదారుల సమస్యలు, మానవ హక్కులు వంటి అంశాలపై ప్రచారాలు కొనసాగుతున్నాయి.

అజ్‌ట్లాన్‌ వారియర్స్, రెసిస్టర్స్, బ్లాక్‌ ఎలివేషన్‌ వంటి పేజీలు ఫేస్‌బుక్‌ తొలగించిన వాటిలో ఉన్నాయి.  ప్రధానంగా వాషింగ్టన్‌లో వచ్చేవారం జరగనున్న హక్కుల ఐక్య ర్యాలీకి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఫేస్‌బుక్‌లో పేజీలు క్రియేట్‌ అయ్యాయి.  అమెరికా వలస విధానాల్ని లక్ష్యంగా చేసుకొని ఐసీఈ రద్దు హ్యాష్‌ట్యాగ్‌తో కూడా ప్రచారం సాగుతోంది. 2 లక్షల 90 వేల మందికి పైగా వినియోగదారులు ఈ ఫేస్‌బుక్‌ పేజీలను ఫాలో అవుతూ ఉంటే, ఆ పేజీల్లో ప్రకటనల కోసం 11 వేల డాలర్లు ఖర్చు చేశారు. ఈ ప్రచారాల వెనుక విదేశీ హస్తం ఉందన్న అనుమానంతో ఫేస్‌బుక్‌ వాటిని తొలగించింది. ఇటీవల జరిగిన ట్రంప్, పుతిన్‌ భేటీ అనంతరం అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదన్న పుతిన్‌ ప్రకటన నమ్మశక్యంగా ఉందని ట్రంప్‌ అంగీకరించిన నేపథ్యంలో దీనికి ప్రాముఖ్యత లభించింది. 

ఇదంతా రష్యా పనే : అమెరికా సెనేటర్‌ 
అమెరికా ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రచారాన్ని నిర్వహించడానికి ఏ దేశం ప్రయత్నించిందో ఫేస్‌బుక్‌  వెల్లడించలేకపోయినప్పటికీ, నవంబర్‌లో జరిగే ఎన్నికల్ని కూడా ప్రభావితం చేయడానికి రష్యాయే ప్రయత్నిస్తోందని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘అమెరికా ప్రజల్లో చీలిక తెచ్చేలా తప్పుడు ప్రచారాలన్నీ సాగుతున్నాయి. ఇదంతా రష్యా చేస్తున్న పనే. ఫేస్‌బుక్‌ కొంతవరకైనా అడ్డుకోవడం అభినందనీయం‘ అని సెనేటర్‌ మార్క్‌ వార్నర్‌ వ్యాఖ్యానించారు. కాగా అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులు మాత్రం ఫేస్‌బుక్‌ ప్రచారం వెనుక రష్యా హస్తం ఉందని చెప్పడానికి తగినన్ని ఆధారాలు ఇంకా లభించలేదని అంటున్నారు. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల్లో  రష్యా చేసిన ప్రచారం మాదిరిగానే, అదే లక్ష్యంతో, అదే రకమైన భాషతో మళ్లీ సరికొత్త ప్రచారం ఫేస్‌బుక్‌లో మొదలైందని వారు అంగీకరిస్తున్నారు.

ఈ ప్రచారం వెనుక రష్యాకు చెందిన ఇంటర్నెట్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ హస్తం ఉందన్న అనుమానాలైతే ఉన్నాయి.  గత రెండేళ్లలో ఫేస్‌బుక్‌లో రష్యా మద్దతు పలికే రాజకీయ పరమైన అంశాలను 12.6 కోట్ల మంది అమెరికన్లు ఫాలో అయ్యారని ఒక అంచనా.. 1.6 కోట్ల మంది అమెరికన్ల సమాచారం ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటో షేరింగ్‌ యాప్‌ ద్వారా రష్యాకు చేరి ఉంటుందని అనుమానాలైతే ఉన్నాయి. అయితే ఫేస్‌బుక్‌ వినియోగదారుల ఆలోచనల్ని ప్రభావితం చేసే ఎలాంటి ప్రచారాన్నయినా అడ్డుకుంటామని ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ షెర్లీ శాండ్‌ బర్గ్‌ స్పష్టం చేశారు. వినియోగదారుల డేటా భద్రత కోసం ఫేస్‌బుక్‌ 20 వేల మంది ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement