వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో టిక్‌టాక్ షార్ట్ వీడియో యాప్‌పై చర్యలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. త్వరలో టిక్‌టాక్‌పై అమెరికా ప్రతినిధుల సభ పాస్ చేయనున్న నిషేధం బిల్లుపై రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా అభ్యంతరం వ్యక్తం చేశారు. టిక్‌టాక్ లేకపోతే యువత నొచ్చుకుంటుందని అంతేగాక మెటాకు చెందిన ఫేస్‌బుక్ బలోపేతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫేస్‌బుక్‌లో నిజాయితీ లేదని, టిక్‌టాక్ నిషేదం వల్ల ఫేస్‌బుక్ లాభపడటం తనకు ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యాప్‌ను ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో యువత వాడుతోందని, వారంతా యాప్ లేకపోతే పిచ్చివాళ్లయ్యే అవకాశం ఉందన్నారు. టిక్‌టాక్‌లో మంచితో పాటు చెడు కూడా ఉందన్నారు. 2021లో క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా ట్రంప్ పెట్టిన పోస్టులను ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ నుంచి మెటా డిలీట్ చేసింది. దీంతో మెటాపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్లంతా ఫేస్‌బుక్‌ను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల తర్వాత ఫేస్‌బుక్ షేర్లు స్టాక్‌మార్కెట్‌లో నష్టాలు చవిచూశాయి.
అయితే 2020లో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాకు చెందిన టిక్‌టాక్‌తో పాటు వి చాట్‌ను నిషేధించడానికి ట్రంప్ ప్రయత్నించడం గమనార్హం. కోర్టులు జోక్యం చేసుకుని ఈ ప్రయత్నానికి బ్రేకులు వేశాయి. ప్రస్తుతం మళ్లీ అధ్యక్ష ఎన్నికలకు పోటీపడుతున్న వేళ ట్రంప్ టిక్‌టాక్ నిషేధంపై మాట మార్చడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఓపక్క యువతను ఆకట్టుకోవడంతో పాటు మరోపక్క తనకు ఇష్టంలేని ఫేస్‌బుక్ చెక్ పెట్టడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా, అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది టిక్‌టాక్‌ను వాడుతున్నారు. యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం(మార్చ్ 13)న టిక్‌టాక్‌పై దాదాపు నిషేధం విధించినంత పనిచేసే ఓ కీలక బిల్లును పాస్ చేయనుంది. ఈ బిల్లు పాసైన 165 రోజుల లోపు చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ కంపెనీ టిక్‌టాక్‌ను అమ్మేయాల్సి అమ్మేయాల్సి ఉంటుంది. లేదంటే గూగుల్, ఆపిల్ ప్లే స్టోర్లు టిక్‌టాక్‌కు వెబ్ హోస్టింగ్ సేవలు నిలిపివేస్తాయి.
ఈ బిల్లు గనుక ఏకగ్రీవంగా పాసైతే దీనిపై తాను సంతకం చేస్తానని అధ్యక్షుడు బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోపక్క తాము అమెరికన్ల డేటాను చైనాకు గతంలో ఎప్పుడూ షేర్ చేయలేదని, ఇక ముందు కూడా షేర్ చేయబోమని టిక్‌టాక్ యాప్ యాజమాని బైట్‌డ్యాన్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. యాప్‌పై నిషేధం అమెరికా ప్రజల రాజ్యాంగ హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని మండిపడింది.
ఇదీ చదవండి.. భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర.. కారణమిదే
Comments
Please login to add a commentAdd a comment