మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా తాజా వైఖరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి విషయంలో పుతిన్‌ను సమర్థించే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌వైపు కాకుండా డెమొక్రాట్ అభ్యర్థి కమలాహారిస్‌వైపు రష్యా మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయమై తాజాగా ఓ టీవీచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్ష పోరులో తలపడుతున్న అభ్యర్థుల్లో ట్రంప్ కంటే కమలాహారిసే అంచనా వేయదగ్గ వ్యక్తని చెప్పారు. అయితే తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తిగా అమెరికా అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే రష్యా, ఉక్రెయిన్ సమస్య పరిష్కరిస్తామని ట్రంప్ ఇస్తున్న హామీని పెస్కోవ్ కొట్టిపారేశారు.
రష్యా,ఉక్రెయిన్ సమస్య టక్కున పరిష్కరించేందుకు ట్రంప్ దగ్గర మంత్రదండమేమీ లేదన్నారు. కాగా, గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చారు. ట్రంప్ కంటే బైడెనే బెటరని ఓసారి ట్రంప్‌ను కోర్టులను అడ్డుపెట్టుకుని అధ్యక్ష ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని భిన్న వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment