
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ భారీగా తన సంపదను కోల్పోయారు. గత రెండు నెలల వ్యవధిలో 10.3 బిలియన్ డాలర్లను ఆయన కోల్పోయినట్టు తాజా రిపోర్టు రివీల్ చేసింది. అంతేకాక బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో జుకర్‌బర్గ్ 3 స్థానాలు కిందకి పడిపోయి, 7వ స్థానంలోకి వచ్చేశారు. మరోవైపు ఫేస్‌బుక్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. యూజర్ల డేటాను ఇది అమ్మేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాల సమాచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పనిచేసే కేంబ్రిడ్జ్ అనలిటికాకు చిక్కినప్పటికీ ఆ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
దీంతో ఫేస్‌బుక్ స్టాక్స్ కూడా 14 శాతం కిందకి పడిపోయాయి. వారం వ్యవధిలోనే 13 శాతం మేర కిందకి దిగజారి 160 డాలర్లకు చేరుకున్నాయి. ఈ వారంలోనే ఫేస్‌బుక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 75 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. కొన్ని రోజుల క్రితమే కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాంపై నోరువిప్పిన జుకర్‌బర్గ్ తాము తప్పు చేసినట్టు ఒప్పుకున్నారు. మీ డేటాను రక్షించే బాధ్యత తమదని, ఒకవేళ తాము అలా చేయలేకపోతే, మీకు సేవ చేసే అర్హత కలిగి ఉండమని తెలిపారు. ఇప్పుడు జరిగింది మరోసారి జరగదని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment