ఫేస్‌బుక్ (ఫైల్ ఫోటో)
బెంగళూరు : ఇటీవల డేటా చోరి ఉదంతంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తీవ్ర విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. తన ప్లాట్‌ఫామ్స్ పై ఉన్న థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా డేటా దుర్వినియోగమవుతుందని ఫేస్‌బుక్ సైతం గుర్తించింది. దీంతో కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌ను సమీక్షించడం ప్రారంభించింది. ఈ సమీక్షలో భాగంగా తొలి స్టేజీలో 200 యాప్స్‌పై ఫేస్‌బుక్ వేటు వేసింది. యూజర్లకు చెందిన డేటాను దుర్వినియోగ పరిచారో లేదో తెలుసుకునే క్రమంలో 200 యాప్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఫేస్‌బుక్ ప్రొడక్ట్ పార్టనర్‌షిప్స్ వైస్ ప్రెసిడెంట్ ఇమి ఆర్చిబాంగ్ తెలిపారు. ఈ విచారణలో భాగంగా వేలకొద్దీ యాప్స్‌ను పరిశీలిస్తున్నట్టు కూడా చెప్పారు.
ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ సైతం తమ ప్లాట్‌ఫామ్‌పై యాప్స్‌పై విచారణ చేపట్టనున్నట్టు మార్చి నెలలోనే ప్రకటించారు. 2014లో డేటా యాక్సస్ నియంత్రించడానికి కంటే ముందు పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరించిన అన్ని యాప్స్‌పై తాము విచారణ చేపట్టనున్నట్టు జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఈ విచారణ కోసం తమకు పెద్ద ఎత్తున్న అంతర్గత, బహిరంగ నిపుణులతో కూడిన టీమ్‌లు ఉన్నాయని ఆర్చిబాంగ్ చెప్పారు. వీరు వెంటనే ఈ విచారణ ఫలితాలను వెల్లడించనున్నారని పేర్కొన్నారు.
కేంబ్రిడ్జ్ అనలిటికా అక్రమంగా ఫేస్‌బుక్ యూజర్ల డేటాను పొందిన తర్వాత ఈ సోషల్ మీడియా దిగ్గజం పెద్ద ఎత్తున్న డేటా స్కాం విమర్శలు పాలైంది. ఈ స్కాండల్ అనంతరం ఫేస్‌బుక్ బిలియన్ల కొద్దీ మార్కెట్ విలువను కోల్పోయింది. తాము తప్పు చేసినట్టు జుకర్‌బర్గ్ సైతం ఒప్పుకుని, ఫేస్‌బుక్ యూజర్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌ను అత్యంత సురక్షితంగా రూపుదిద్దుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment