లండన్: ఫేస్‌బుక్ ఖాతాల సమాచార దుర్వినియోగ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన క్రిస్టొఫర్ వైలీ తాజాగా కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) భారత్‌లో సాగించిన కార్యకలాపాలను కూడా బట్టబయలు చేశారు. తనకు తెలిసినంత వరకు సీఏ 2003 నుంచి భారత్‌లో వివిధ పార్టీలకు సేవలు అందిస్తోందనీ, ఆ సంస్థ సేవలను కాంగ్రెస్ పార్టీ వాడుకుందని వైలీ యూకే పార్లమెంటరీ కమిటీకి మంగళవారం చెప్పారు. సీఏ మాజీ ఉద్యోగి అయిన వైలీ బుధవారం ట్వీటర్ వేదికగా మరికొన్ని విషయాలను బయటపెట్టారు. 2010లో బిహార్ శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ సీఏ సేవలను వినియోగించుకుందన్నారు.
అలాగే ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో కులాల వారీగా సంస్థ కుటుంబాల వివరాలను సేకరించిందని తెలిపారు. ‘సీఏ భారత్‌లోనూ పనిచేస్తోంది. అక్కడి ఘజియాబాద్‌లో సంస్థ భారత విభాగం ప్రధాన కార్యాలయం ఉంది. హైదరాబాద్ సహా 9 నగరాల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ఆధునిక వలసవాదం అంటే ఇదే’అని వైలీ ట్వీటర్‌లో తెలిపారు. భారత్‌లో 600 జిల్లాల్లోని 7 లక్షల గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబాల వివరాలు తమ వద్ద ఉన్నాయనీ, ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుందని సీఏ చెప్పుకుంటున్నట్లు వైలీ ట్వీట్ ద్వారా వెల్లడైంది.
ఎన్నికల్లో ఎక్కడ ఎవర్ని అభ్యర్థిగా నిలబెట్టాలి, ఏ కులం వారిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయాలి, ఎలాంటి ఉపన్యాసాలు/హామీలు ఇవ్వాలి తదితర నిర్ణయాలను తీసుకోడానికి అవసరమైన సమాచారాన్ని క్లయింట్ పార్టీలకు సీఏ అందించిందని వైలీ చెప్పారు. 2003లో రాజస్తాన్‌లో ప్రాంతీయ ప్రధాన పార్టీ, అదే ఏడాది మధ్యప్రదేశ్‌లో ఓ జాతీ య పార్టీ, 2007, 2012ల్లో ఉత్తరప్రదేశ్‌లో ఓ జాతీయ పార్టీ సహా 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ సీఏ సేవలను వివిధ పార్టీలు ఉపయోగించుకున్నట్లు వైలీ ట్వీట్లు స్పష్టం చేశాయి. సీఏ అందించిన కులాల విశ్లేషణ వివరాలను జేడీయూ వినియోగించుకుందన్నది వాస్తవం కాదనీ, అలాంటి ఎన్నికల రాజకీయాలకు పాల్పడే పార్టీ తమది కాదని జేడీయూ నేత కేసీ త్యాగి పేర్కొన్నారు.
ఫేస్‌బుక్‌కు కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని సీఏ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వినియోగదారుల డేటా లీక్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమకు అందించాల్సిందిగా ఫేస్‌బుక్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. అలాగే యూజర్ల సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో తెలపాలని కోరింది.
ఏప్రిల్ 7వ తేదీలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని కేంద్రం ఫేస్‌బుక్‌కు గడువు విధించింది. కాగా, వ్యక్తిగత సమాచార భద్రతకు సంబంధించిన భద్రతా సాధనాల్లో (ప్రైవసీ సెట్టింగ్స్) సమగ్ర మార్పులు చేపట్టనున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. తద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతను పూర్తిగా వారి చేతుల్లోనే ఉంచేలా నూతన భద్రతా సాధనాలను రూపొందిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment