నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : సరికొత్త భారతాన్ని ఆవిష్కరిస్తాన న్న ప్రతిజ్ఞతతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నమో యాప్’ ద్వారా యూజర్ల సమాచారం అమెరికాలోని ఓ కంపెనీకి వెళుతోందన్న గుట్టురట్టవడంతో ఈ యాప్‌కు ‘ముందున్న హెచ్చరిక’ మాటనే మార్చి వేశారు. ‘మీ వ్యక్తిగత సమాచారం. మీ కాంటాక్టు వివరాలు, నెంబర్లు గోప్యంగా ఉంటాయి. మీరు, మేము సమాచారం ఇచ్చి, పుచ్చుకోవడానికి మినహా మరో అవసరానికి వీటిని ఉపయోగించం. ముఖ్యంగా మీ సమాచారాన్ని మీ అనుమతి లేకుండా ఏ రూపంలో కూడా మూడవ పార్టీకి తెలియజేయం’ అంటూ నమో యాప్‌లో ఆదివారం వరకు కనిపించిన ఈ హెచ్చరిక సోమవారానికి మారిపోయింది.
పాత వ్యాఖ్యల చోటా‘మీకు మరింత మంచి అనుభవాన్ని ఇవ్వడం కోసం పేరు, ఈ మెయిల్, మొబైల్ నెంబర్, మొబైల్ సమాచారం, లొకేషన్, నెట్‌వర్క్ క్యారియర్‌కు సంబంధించిన సమాచారాన్ని మూడో పార్టీ ప్రాసెస్ చేయవచ్చు’ అంటూ కొత్త వ్యాఖ్య వచ్చి చేరింది. నమో యాప్ యూజర్ల సమాచారం ఎప్పటికప్పుడు ‘క్లెవర్ ట్యాప్ కంపెనీ ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా ఏర్పాటైన ‘విజ్‌రాకెట్ ఐఎన్‌సీ’ అనే వెబ్ అనాలసిస్ ఫ్లాట్‌ఫారమ్‌కు చేరుతోందంటూ ప్రముఖ ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియెట్ ఆల్డర్సన్ (నకిలీ పేరు) శనివారం బయటపెట్టి భారత రాజకీయాల్లో బాంబు పేల్చారు.
ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించి కేంబ్రిడ్జి అనలిటికా కంపెనీ కొన్ని పార్టీల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో దేశంలో కూడా రాజకీయ దుమారం రేగిన విషయం తెల్సిందే. సరిగ్గా ఇదే సమయంలో నమో యాప్ సమాచారం మూడో పార్టీకి వెళుతోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దీనిపై రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘బిగ్‌బాస్’గా సంబోధిస్తూ వ్యంగోక్తులు విసరడం, అందుకు ప్రతిగా మోదీ తరఫున కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఛోటా భీమ్’ అంటూ రాహుల్ గాంధీపై వ్యంగోక్తులు విసిరిన విషయం తెల్సిందే.
శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీపై బాంబు పేల్చిన హ్యాకర్ ఆల్డర్సన్ సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధికార యాప్ ‘ఐఎన్‌సీ యాప్’పై కూడా బాంబు పేల్చారు.
ఈ యాప్ యూజర్ల సమాచారం కూడా సింగపూర్‌లోని మూడోపార్టీకి వెళుతోందని ఆరోపించారు. దీనిపై వెంటనే స్పందించిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ‘నాపేరు రాహుల్ గాంధీ. భారత్‌లోని అతి పురాతన రాజకీయ పార్టీకి నేను అధ్యక్షుడిని. మా పార్టీ యాప్‌కు మీరు సైనప్ కాగానే మీ సమాచారాన్ని సింగపూర్‌లోని మా స్నేహితులకు అందజేస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఐఎన్‌సీ యాప్ పనిచేయడం లేదు.
‘మీ యాప్ కూడా మూడోపార్టీకి సమాచారం చేరవేస్తోంది’ అంటూ వస్తున్న ప్రతి విమర్శలకు ‘మా యాప్ పనిచేయడం లేదు’ అంటూ రాహుల్ గాంధీ సమాధానం ఇస్తున్నారు. ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, అటు రాహుల్ గాంధీకి తెలియకుండానే యూజర్ల సమాచారం మూడో పార్టీకి వెళుతుండవచ్చు. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు చిత్తశుద్ధితో వాస్తవాన్ని అంగీకరించి పొరపాటును సరిదిద్దడం సాధారణ రాజకీయ నాయకుడి నైతిక బాధ్యత అయినప్పుడు అంతకన్నా పైస్థాయిలో ఉన్నవారికి ఎంత నైతిక బాధ్యత ఉండాలో విడిగా చెప్పాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment