సాక్షి, న్యూఢిల్లీ : ఇటు ప్రధానమంత్రి నరేంద్రమోదీకకి చెందిన ‘నమో’ యాప్.. అటు కాంగ్రెస్ పార్టీ అధికారిక యాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశీ కంపెనీలకు చేరవేస్తూ.. డాటా ఉల్లంఘనలకు పాల్పడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రరూపం దాల్చాయి. ‘నమో’ యాప్ ద్వారా భారతీయులపై గూఢచర్యం చేస్తున్న బిగ్‌బాస్‌గా ప్రధాని నరేంద్రమోదీ మారిపోయారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
నమో యాప్ రహస్యంగా ఆడియో, వీడియోలను రికార్డు చేయగలదని, కాంటాక్ట్ డాటాతోపాటు జీపీఎస్ వివరాలను ట్రాక్ చేయగలదని రాహుల్ ఆరోపించారు. నమో యాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమెరికాలోని థర్డ్ పార్టీ కంపెనీ క్లెవర్ ట్యాప్‌కు చేరవేస్తోందని ఫ్రెంచ్ సెక్యూరిటీ పరిశోధకుడు ఎలియట్ అల్డర్సన్ వెల్లడించడంతో రాహుల్ ఈ మేరకు ట్విట్టర్‌లో మండిపడ్డారు. 13 లక్షల ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ఒత్తిడి చేశారని, మన పిల్లల సమాచారాన్ని కూడా మోదీ వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు.
నమో యాప్ ద్వారా దేశ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ.. ప్రధాని మోదీ తన పదవిని దుర్వినియోగపరుస్తున్నారని, ప్రధానిగా ఆయన ఈ సమాచారం సేకరించాలంటే పీఎంవో యాప్ వాడాలి కానీ, నమో యాప్ కాదని రాహుల్ విరుచుకుపడ్డారు. ‘నమో’ యాప్‌పై రాహుల్ ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా స్పందించారు. మొబైల్ యాప్‌లు మామూలు పర్మిషన్స్ అడుగుతాయని, ఈ విషయం ‘ఛోటా భీమ్’కు కూడా తెలుసునని పరోక్షంగా రాహుల్‌ను ఎద్దేవా చేశారు. ఇది గూఢచర్యమంటూ గందరగోళ పడవద్దని రాహుల్‌కు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment