Chhota Bheem
-
ఛోటా భీమ్-ఇందుమతి పెళ్లి: నిజమేనా?
పిల్లల నుంచి యువతీయువకుల వరకు అందరికీ ఎంతగానో నచ్చే కార్టూన్ ప్రోగ్రాంలో "చోటా భీమ్" అగ్రస్థానంలో ఉంటుంది. లాక్డౌన్ పుణ్యమాని అందరూ మరోసారి ఈ యానిమేషన్ ప్రోగ్రామ్ వీక్షిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కాగా "ఛోటా భీమ్" కార్టూన్ విషయానికొస్తే.. ఢోలక్ పూర్ అనే పల్లెటూరిలో తొమ్మిదేళ్ల ఛోటా భీమ్ అనే శక్తివంతుడైన కుర్రాడు ఉంటాడు. ఎవరికి ఆపద వచ్చినా తక్షణమే భీమ్ వారిని రక్షిస్తాడు. అయితే అతనికి ఎంతో ఇష్టమైన లడ్డూ తింటే గానీ శత్రువుని ఎదిరించలేడు. ఇక ఛోటా భీమ్‌కు చుట్కీ, రాజు, జగ్గు అనే కోతి, ఆ ఊరి రాజుగారి కూతురు ఇందుమతి స్నేహితులు. (బుజ్జి బుజ్జి మాటలు) ఇందులో చుట్కీ.. భీమ్‌కు బెస్ట్ ఫ్రెండ్. అయితే తాజాగా ఛోటా భీమ్ ఇందుమతిని పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. "లేదు, వీల్లేదు, భీమ్.. చుట్కీకి అన్యాయం చేయకూడదు" "చుట్కీని ఒంటరిగా వదిలేయకు భీమ్.." అంటూ నెటిజన్లు కోరుతున్నారు. దీంతో ట్విటర్లో గురువారం #JusticeForChutki ట్రెండింగ్‌లో నిలిచింది. దీనిపై స్పందించిన కార్టూన్ నిర్వాహకులు గ్రీన్ గోల్డ్ యానిమేషన్స్ అదంతా అబద్ధమని కొట్టిపారేసింది. భీమ్-ఇందుమతి వివాహం వుట్టి పుకారేనని స్పష్టం చేసింది. భీమ్, చుట్కీ, ఇందుమతి ఇంకా చిన్నపిల్లలే అని, వారి మధ్య ప్రేమ, పెళ్లి అనే విషయాలను జోడించకండి అని సెలవిచ్చింది. దీంతో శాంతించిన అభిమానులు "న్యాయం జరిగింది" అంటూ సంతోషం వ్యక్తం చేశారు. (‘చోటా భీమ్’కు కేటీఆర్ అభినందనలు) -
‘చోటా భీమ్’కు కేటీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ యానిమేషన్ కంపెనీ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కోవిడ్-19 వైరస్‌పై తనదైన శైలిలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ వైరస్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో చోటా భీమ్ కేరెక్టర్ ద్వారా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ట్విటర్లో షేర్ చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అత్యంత ఇష్టపడే చోటా భీమ్ కేరెక్టర్ ద్వారా కోవిడ్ లాంటి కీలకమైన, అత్యంత ఆవశ్యకమైన అంశంపై ప్రజలను చైతన్యపరిచేందుకు ముందుకు వచ్చిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థను ఆయన అభినందించారు. చోటా భీమ్ కేరెక్టర్ ద్వారా చేపట్టిన ప్రచారం ముఖ్యంగా బడిపిల్లల్లో విసృత అవగాహన పెంపొందిస్తుందని గ్రీన్ గోల్డ్ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. -
చోటా భీమ్‌ను ఆస్కార్‌కు తీసుకెళ్లాలి
‘‘ఇది వరకు చూసిన ‘చోటాభీమ్’ చిత్రాలకు, ఇప్పడు వస్తున్న ‘చోటా బీమ్: కుంగ్‌ఫూ ధమకా’కి తేడా ఏంటంటే ‘ఎక్స్పీరియన్స్’. పాత సినిమాలన్నీ 2డీలో షూట్ చేశాం. లేటేస్ట్ చిత్రాన్ని స్టీరియోస్కోపిక్ 3డీలో షూట్ చేశాం. మునుపటి సినిమాల కంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు ‘చోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక. యానిమేషన్ క్యారెక్టర్ చోటా భీమ్ ముఖ్య పాత్రలో రాజీవ్ చిలక తెరకెక్కించిన తాజా చిత్రం ‘చోటా భీమ్: కుంగ్ఫు ధమాకా’. ఈ చిత్రం మే 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజీవ్ మాట్లాడుతూ – ‘‘చోటా భీమ్’, అతని గ్యాంగ్ కలసి చైనా వెళ్లి, అక్కడ కుంగ్‌ఫూ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఈ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అన్నదే సినిమా కథ. పిల్లలు ఎంజాయ్ చేసే యాక్షన్, కామెడీ ఇందులో ఉంటాయి. చైనీస్ ఫుడ్‌ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించి ఓ సాంగ్ ఉంది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీతో ఓ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేశాం. సినిమా లాస్ట్‌లో వచ్చే ఈ సాంగ్‌లో సినిమాలోని క్యారెక్టర్స్‌తో పాటు దలేర్ పాడుతూ, డ్యాన్స్ చేస్తారు. మన ఫ్రెండ్‌కి ఏదైనా కష్టం ఎదురైతే మనం నిలబడాలి. మన సైజ్ కాదు.. మన సంకల్పం ముఖ్యం అనే సందేశం ఈ సినిమాలో ఉంటుంది. 3డీ సినిమాకు చాలా ఫోకస్ కావాలి. ఈ సినిమాను ఐదేళ్లుగా షూట్ చేస్తున్నాం. ఏదో రోజు చోటాభీమ్ ఆస్కార్‌కు వెళ్తాడు అనే నమ్మకం ఉంది, తీసుకువెళ్లడానికి మా సామర్థ్యం మించి పని చేస్తాం’’ అని అన్నారు. -
మోదీ బిగ్‌బాస్.. రాహుల్ ఛోటా భీమ్!
సాక్షి, న్యూఢిల్లీ : ఇటు ప్రధానమంత్రి నరేంద్రమోదీకకి చెందిన ‘నమో’ యాప్.. అటు కాంగ్రెస్ పార్టీ అధికారిక యాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశీ కంపెనీలకు చేరవేస్తూ.. డాటా ఉల్లంఘనలకు పాల్పడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు తీవ్రరూపం దాల్చాయి. ‘నమో’ యాప్ ద్వారా భారతీయులపై గూఢచర్యం చేస్తున్న బిగ్‌బాస్‌గా ప్రధాని నరేంద్రమోదీ మారిపోయారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. నమో యాప్ రహస్యంగా ఆడియో, వీడియోలను రికార్డు చేయగలదని, కాంటాక్ట్ డాటాతోపాటు జీపీఎస్ వివరాలను ట్రాక్ చేయగలదని రాహుల్ ఆరోపించారు. నమో యాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమెరికాలోని థర్డ్ పార్టీ కంపెనీ క్లెవర్ ట్యాప్‌కు చేరవేస్తోందని ఫ్రెంచ్ సెక్యూరిటీ పరిశోధకుడు ఎలియట్ అల్డర్సన్ వెల్లడించడంతో రాహుల్ ఈ మేరకు ట్విట్టర్లో మండిపడ్డారు. 13 లక్షల ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా ఒత్తిడి చేశారని, మన పిల్లల సమాచారాన్ని కూడా మోదీ వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. నమో యాప్ ద్వారా దేశ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ.. ప్రధాని మోదీ తన పదవిని దుర్వినియోగపరుస్తున్నారని, ప్రధానిగా ఆయన ఈ సమాచారం సేకరించాలంటే పీఎంవో యాప్ వాడాలి కానీ, నమో యాప్ కాదని రాహుల్ విరుచుకుపడ్డారు. ‘నమో’ యాప్‌పై రాహుల్ ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా స్పందించారు. మొబైల్ యాప్‌లు మామూలు పర్మిషన్స్ అడుగుతాయని, ఈ విషయం ‘ఛోటా భీమ్’కు కూడా తెలుసునని పరోక్షంగా రాహుల్‌ను ఎద్దేవా చేశారు. ఇది గూఢచర్యమంటూ గందరగోళ పడవద్దని రాహుల్‌కు హితవు పలికారు. -
ఒకే వీడియోలో ఛోటా భీమ్, రాహుల్ గాంధీ!
రాహుల్‌గాంధీ.. ఒకరకంగా నెటిజన్లకు చాలా ఇష్టమైన పేరు. కొందరు ఆయన నాయకత్వాన్ని అభిమానిస్తే.. మరికొందరు ఆయన ప్రసంగాలు, విమర్శలపై జోకులు పేలుస్తుంటారు. రాజకీయాల్లో రాహుల్ రాణించడం సంగతి పక్కనపెడితే.. ఆయన మాత్రం దేశ ప్రజల్ని ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారని ఇంకొందరు ఛలోక్తులు విసురుతుంటారు. మొత్తానికి నెటిజన్లలో రాహుల్‌కు మాత్రం మంచి క్రేజ్ ఉంది. దీనిని ఉపయోగించుకొని 'దేశీ స్టఫ్' అనే గ్రూప్ ఓ కొత్త వీడియోను తీసుకొచ్చింది. ఈ వీడియోలో చిన్నారుల సూపర్ హీరో 'ఛోటా భీమ్'ను, రాహుల్‌ను ఓకే వేదికపైకి తీసుకొచ్చింది. కొన్ని రోజుల కిందట రాహుల్ గాంధీ చేసిన ఆవేశపూరిత ప్రసంగానికి.. 'ఛోటా భీమ్' ఎక్స్ప్రెషన్స్ జోడించింది. సహజంగానే జోడింపు నవ్వుల పువ్వులు కురిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. రాహుల్ ఇలాగే దేశాన్ని నవ్విస్తూ ముందుకు నడుపాలని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
షారుక్ కుమారున్ని కలిసిన 'ఛోటా భీమ్'
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు అబ్రామ్ కోరిక నెరవేరింది. అబ్ రామ్‌కి ఎంతగానో ఇష్టమైన 'ఛోటాభీమ్' క్యారెక్టర్ సృష్టికర్త గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సీఈఓ రాజీవ్ చిలకను తన నివాసంలో కలుసుకున్నాడు. రాజీవ్, షారుక్ కుమారుడి కోసం ఒక బొమ్మను గిఫ్ట్ గా తీసుకువచ్చాడు. పిల్లలు ఛోటా భీమ్ కార్యక్రమాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారని షారుక్ తెలిపారు. మరోవైపు ఛోటా భీమ్ కార్యక్రమం పిల్లలు చూడవలసిన ఒక మంచి కార్యక్రమమని నటి కాజల్ కూడా ప్రశంసించారు. రాజీవ్ తదుపరి కార్టూన్ ప్రోగ్రామ్ 'చోటాభీమ్-హిమాలయన్ ఆడ్వెంచర్' జనవరి 8న విడుదల కానుంది. సరోగసి ద్వారా షారుఖ్ అబ్‌రామ్‌కు తండ్రి అయిన విషయం తెలిసిందే. చోటాభీమ్, మోగ్లీ కార్యక్రమాలంటే అబ్రామ్ కు ఎంతో ఇష్టమని ఇది వరకే షారుఖ్ తెలిపిన విషయం విధితమే. -
పిల్లల్ని గమనిస్తుంటా
బుల్లితెరపై తన పిల్లలు ఏమిచూస్తుంటారనే విషయాన్ని గమనిస్తుంటానని నటి కాజోల్ తెలిపింది. ప్రతి ఒక్కరూ పిల్లలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సిందేనంది. మదర్స్ డేని పురస్కరించుకుని ఛోటా భీం సీరియల్ రూపకర్త అయిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ కాజోల్‌ను మైటీ మదర్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం ఆదివారం జరగనుంది. ‘పిల్లలు బుల్లితెరపై ఏమిచూస్తున్నారనే విషయాన్ని గమనించాలనే ఆసక్తి ప్రతి తల్లికి ఉంటుంది. మనమంతా ఈ ప్రపంచంలో ఓ భాగం మాత్రమే’నని 11 ఏళ్ల న్యాస, మూడేళ్ల యుగ్‌కు తల్లి అయిన 39 ఏళ్ల కాజోల్ తన మనసులో మాట బయటపెట్టింది. ‘ మా పిల్లలు టీవీ చూస్తున్న సమయంలో వంట చేస్తూ ఉంటా. అప్పుడప్పుడూ వాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటా. ఆ తరువాత అందరం కలిసి ధారావాహికలను తిలకిస్తాం. అలా రోజులు గడుపుతుంటా.’ అని అంది. ‘పిల్లలు ఏయే చానళ్లు చూడొచ్చు ? చూడకూడదనేదానికి సంబంధించి నా వద్ద ఓ జాబితా కూడా ఉంది. ఒకవేళ వాళ్లు టీవీచూసే సమయంలో నేను ఇంటి వద్ద లేకపోయినా వారిని ఎవరో ఒకరు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొంచెం క్రమశిక్షణతోనే ఉండాలి. వారికి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలి. ఏదిఏమైనప్పటికీ నా పిల్లలంతా వారికి నేను విధించిన హద్దుల్లోనే ఉంటారు. అన్ని విషయాలు నేర్చుకునే వయసు. వారు బాగా ఎదగాల్సి ఉంటుంది. అందువల్ల వారు ఏమిచదువుతున్నారు? ఏమి చూస్తున్నారనే విషయాల్ని మనమంతా గమనించాలి’ అని అంది. -
మైటీ రాజు వస్తున్నాడు
పిల్లలకు ఇష్టమైన యానిమేషన్ చిత్రం ‘చోటా భీమ్’. ఇందులో మైటీ రాజు పాత్రంటే కూడా పిల్లలకు మహా ఇష్టం. ఆ పాత్రనే హీరోగా చేసుకొని రూపొందిన మరో యానిమేషన్ హిందీ సినిమా ‘మైటీ రాజు రియో కాలింగ్’. రాజీవ్ చిలక, అనిర్బన్ మజుందార్ దర్శకులు. రాజీవ్ చిలక, సామిర్ జైన్ నిర్మాతలు. శ్యామల్ చౌలియా ఈ సినిమాకు యానిమేషన్ అందించారు. ఈ సినిమా యూనిట్ గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్, యాక్షన్ నేపథ్యంలో సాగే సూపర్‌హీరో సినిమా ఇదని, బ్రెజిల్‌లోని పలు ప్రదేశాలను తెరకెక్కించామని, సునిల్ సంగీతానికి, సునిధి చౌహాన్ గానానికి మంచి స్పందన రావడం ఖాయమని నిర్మాతలు చెప్పారు. ఇంకా చెబుతూ -‘‘వచ్చే నెలలో 300 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తాం. ఆ తర్వాత స్థానిక భాషల్లో అనువదించే విషయాన్ని ఆలోచిస్తాం’’ అన్నారు.