పిల్లల్ని గమనిస్తుంటా
బుల్లితెరపై తన పిల్లలు ఏమిచూస్తుంటారనే విషయాన్ని గమనిస్తుంటానని నటి కాజోల్ తెలిపింది. ప్రతి ఒక్కరూ పిల్లలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సిందేనంది. మదర్స్ డేని పురస్కరించుకుని ఛోటా భీం సీరియల్ రూపకర్త అయిన గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సంస్థ కాజోల్‌ను మైటీ మదర్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం ఆదివారం జరగనుంది. ‘పిల్లలు బుల్లితెరపై ఏమిచూస్తున్నారనే విషయాన్ని గమనించాలనే ఆసక్తి ప్రతి తల్లికి ఉంటుంది. మనమంతా ఈ ప్రపంచంలో ఓ భాగం మాత్రమే’నని 11 ఏళ్ల న్యాస, మూడేళ్ల యుగ్‌కు తల్లి అయిన 39 ఏళ్ల కాజోల్ తన మనసులో మాట బయటపెట్టింది. ‘ మా పిల్లలు టీవీ చూస్తున్న సమయంలో వంట చేస్తూ ఉంటా.
అప్పుడప్పుడూ వాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటా. ఆ తరువాత అందరం కలిసి ధారావాహికలను తిలకిస్తాం. అలా రోజులు గడుపుతుంటా.’ అని అంది. ‘పిల్లలు ఏయే చానళ్లు చూడొచ్చు ? చూడకూడదనేదానికి సంబంధించి నా వద్ద ఓ జాబితా కూడా ఉంది. ఒకవేళ వాళ్లు టీవీచూసే సమయంలో నేను ఇంటి వద్ద లేకపోయినా వారిని ఎవరో ఒకరు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొంచెం క్రమశిక్షణతోనే ఉండాలి. వారికి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలి. ఏదిఏమైనప్పటికీ నా పిల్లలంతా వారికి నేను విధించిన హద్దుల్లోనే ఉంటారు. అన్ని విషయాలు నేర్చుకునే వయసు. వారు బాగా ఎదగాల్సి ఉంటుంది. అందువల్ల వారు ఏమిచదువుతున్నారు? ఏమి చూస్తున్నారనే విషయాల్ని మనమంతా గమనించాలి’ అని అంది.