వాషింగ్టన్: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికా నియంత్రణ సంస్థలు భారీ జరిమానా విధించనున్నాయి. సోషల్ నెట్‌వర్క్‌ల గోప్యత, సమాచార రక్షణలో లోపాలు వంటి కారణాలకు గానూ ఫేస్‌బుక్‌పై జరిమానా విధించేందుకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) సిద్ధమవుతోంది. దర్యాప్తు సెటిల్‌మెంట్‌లో భాగంగా ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌పై రూ.34,280 కోట్ల (5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించనుంది. దీనికి సంబంధించిన వివరాలను వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో ప్రచురించింది.
వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు ఓ సంస్థపై ఎఫ్‌టీసీ ఇంత భారీజరిమానా విధించడం ఇదే తొలిసారి. దీనికి అమెరికా న్యాయశాఖ ఇంకా ఆమోదించలేదు. సెటిల్‌మెంట్‌లో భాగంగా వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్‌బుక్‌కు కొన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు 2011లో ఎఫ్‌టీసీ ఫేస్‌బుక్‌తో ప్రైవసీ సెటిల్‌మెంట్ చేసుకుంది. దీని ప్రకారం వినియోగదారుల సమాచారాన్ని తమ వ్యాపార భాగస్వామ్య సంస్థలకు అందించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలా చేయని పక్షంలో జరిమానా విధించే హక్కు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment