న్యూఢిల్లీ: సైబర్ దాడుల బారిన పడినవారిలో చాలా మందికి తమ వ్యక్తిగత డేటా చోరీకి గురైన సంగతే తెలియడం లేదు. ప్రతి ముగ్గురిలో ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ రుబ్రిక్ తరఫున వేక్‌ఫీల్డ్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కనీసం 500 మందికి పైబడి సిబ్బంది ఉన్న 1,600 పైగా సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. గత 30 ఏళ్లుగా సైబర్ దాడులను నివారించడంపైనే పరిశ్రమ ఎక్కువగా దృష్టి పెడుతోందని రుబ్రిక్ సీఈవో బిపుల్ సిన్హా తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ దాడులు తప్పకుండా జరిగే అవకాశాలే ఉన్నాయని భావించి, వాటిని దీటుగా ఎదుర్కొనే సన్నద్ధతను సాధించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా సైబర్ పరిశ్రమ ఏడాదికి 200 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తోంది. అయితే, రుబ్రిక్ జీరో ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరి డేటా చౌర్యానికి గురవ్వడమే కాకుండా ఆ విషయం వారికి కనీసం తెలియకపోవడమనేది ఆందోళనకర విషయం‘ అని సిన్హా పేర్కొన్నారు.
నివేదికకు సంబంధించిన మరిన్ని విశేషాలు..
► ఈ ఏడాది జూన్ 30–జులై 11 మధ్య కాలంలో 10 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు.
► నివేదిక ప్రకారం సగం పైగా సంస్థల్లో (53 శాతం) గతేడాది కీలకమైన సమాచారం చోరీకి గురైంది. ప్రతి ఆరు కంపెనీల్లో ఒక సంస్థ (16 శాతం) పలు దఫాలుగా సైబర్ దాడులతో నష్టపోయింది.
► దేశీయంగా ఐటీ లీడర్లలో 49 శాతం మంది .. తమ సంస్థ డేటా పాలసీలో భద్రత అంశం లోపించినట్లు అభిప్రాయపడ్డారు. వచ్చే 12 నెలల్లో తమ సంస్థల్లో కీలక డేటా చోరీకి గురయ్యే రిస్కులు అత్యధికంగా ఉన్నాయని 30 శాతం మంది తెలిపారు.
► సాధారణంగా కంపెనీల్లో డేటా గత 18 నెలల్లో మొత్తం మీద 42 శాతం పెరిగింది. సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సరీ్వస్ (సాస్) రూపంలో డేటా 145 శాతం, క్లౌడ్‌లో (73 శాతం), సంస్థ భౌతిక కార్యాలయాల్లో 20 శాతం మేర పెరిగింది.
► ఒక సాధారణ సంస్థ భద్రపర్చుకోవాల్సిన డేటా వచ్చే ఏడాదిలో 100 బీఈటీబీ (బ్యాక్–ఎండ్ టెరాబైట్)కి పెరుగుతుందని, వచ్చే అయిదేళ్లలో 7 రెట్లు వృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది.
► డేటా వృద్ధితో సమానంగా రిస్కులను ఎదుర్కొనేలా డేటా భద్రతను పెంచుకోలేకపోతున్నట్లు 34 శాతం మంది దేశీ ఐటీ లీడర్లు తెలిపారు. కీలకమైన డేటాను కాపాడుకోవడంలో కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం సానుకూల ప్రభావం చూపగలదని 54 శాతం దేశీ కంపెనీలు భావిస్తుండగా, ఏఐ ఎటువంటి ప్రభావం చూపదని 24 శాతం సంస్థలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment