రోజా (పేరు మార్చడమైనది) ఆఫీసుకు వస్తూనే కొలీగ్ సురేష్ (పేరు మార్చడమైనది) సీట్ వద్దకు విసురుగా వెళ్లింది. సురేష్ ఆమెను చూస్తూనే సీటులో నుంచి లేచి నుంచున్నాడు. ‘అసలు నీకు బుద్ధుందా! నువ్వు మనిషివేనా!?’ అని సురేష్‌పై విరుచుకుపడింది. ఏం జరిగిందో అక్కడ ఎవ్వరికీ అర్ధం కాలేదు. నువ్వీ ఆఫీసులో ఎలా ఉంటావో చూస్తా! నన్నే కామెంట్ చేసేంత సీనుందా!? నీకు’ ఫ్రెండ్ వీణ వచ్చి నచ్చజెప్పి, తీసుకెళ్లేంతవరకు సురేష్‌ని తిడుతూనే ఉంది రోజా.
‘‘నిన్న ఆఫీసుకు నువ్వు శారీలో వచ్చావు. డ్రెస్‌లో కన్నా చీరలో సూపర్‌గా ఉన్నావ్!’ అంటూ సోషల్‌మీడియా వేదికగా రోజా ఫొటోకు రకరకాల కామెంట్స్ పెట్టాడు సురేష్. దీంతో ఆఫీసులో పెద్ద రాద్ధాంతమే జరిగింది.‘సురేష్ తననే టార్గెట్ చేశాడని, అందుకే తనను నలుగురిలో చులకన చేయడానికే రకరకాల కారణాలు వెతుకుతున్నాడంటూ రుజువులు చూపించింది రోజా. ఈ సంఘటన తర్వాత సురేష్ జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆఫీసులో అంతా ప్రశాంతం అనుకున్న రోజాకు నాలుగో రోజు నుంచి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు, మెసేజ్‌లు కనపడటంతో తలకొట్టేసినట్టుగా ఉంది. ఆఫీసు టీమ్‌లో ఉన్నప్పుడు సురేష్‌తో సాధారణంగా షేర్ చేసుకున్న విషయాలు, కలివిడిగా దిగిన ఫొటోలు, తన అకౌంట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టాడు.సురేష్ చేసిన ఈ పని మూలంగా రోజాకు వచ్చిన పెళ్లి సంబంధం కూడా క్యాన్సిల్ అయ్యింది.
సురేష్ చర్యలకు తీవ్ర మానసిక వేదనకు గురైన రోజా, డిప్రెషన్‌కు లోనై ఆఫీసు పనిలో చురుగ్గా పాల్గొనలేకపోయింది. రోజాలో వచ్చిన ఈ మార్పేమిటో అర్థంకాక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
భావ వ్యక్తీకరణకు కళ్లెం తప్పదు
సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణకు, ప్రత్యేకించి గొంతుక లేని వ్యక్తులకు చాలా శక్తివంతమైన సాధనం. సమాజంలోని వ్యక్తులతో కలిసిపోవడానికి తమ వ్యక్తిగత వివరాలు, నమ్మకాలు, ప్రాధాన్యతలను స్వచ్ఛందంగా వెల్లడిస్తారు. మనలో చాలామంది సాధారణంగా స్టేటస్‌లను అప్‌డేట్ చేస్తారు. ఆన్‌లైన్‌లో తమ వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తారు. అయితే, మీ ఆన్‌లైన్ చర్యలు భవిష్యత్తులో విద్యా, వ్యక్తిగత, వృత్తిపరమైన అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇతరులను ఇబ్బంది పెట్టే ఏ వేధింపు అయినా అది నేరమే.
► వ్యక్తులు, రాజకీయ నాయకులతో సహా సమాజంలోని అన్ని వర్గాల నుండి సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పెరుగుతున్నాయనేది వాస్తవం. భద్రత దృష్ట్యా సామాజిక మాధ్యమాలను సెన్సార్ చేసే ఆలోచనలకు పునాది పడిందనే విషయాన్ని విస్మరించకూడదు.
► యూజర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్వేచ్ఛగా ఇచ్చేస్తుంటారు. దీంతో తమ సైట్లలో ఉపయోగించే అన్ని చర్యలను ఇతరులు ట్రాక్ చేస్తారు. తర్వాత ఉపయోగించుకోవడానికి వీలుగా వాటిని దాచిపెట్టుకుంటారు. అంటే మన ప్రతి ప్రవర్తనా అంశం ఇతరులు తమ ఉపయోగాల కోసం సేకరిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
సోషల్ మీడియా మర్యాదలు
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఆఫ్‌లైన్ – ఆన్‌లైన్‌ని ఒకే విధంగా పరిగణించాలి.
► సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది యూనివర్సల్ – ఎక్స్‌ప్రెషన్ కాదు. మీకు హాస్యం కలిగించేది ఇతరులకు హాస్యం కాకపోవచ్చు, కాబట్టి సోషల్ మీడియాలో వ్యక్తీకరణలు జాగ్రత్తగా చేయాలి.
► ఉపయోగంలో లేని మీ అన్ని సోషల్ మీడియా అప్లికేషన్‌లను లాగ్ ఆఫ్ చేయాలి, మీ స్మార్ట్‌ఫోన్ లో ఇతర నోటిఫికేషన్ ఫీడ్‌లు వ్యసనాలకు దారి తీయడమే కాకుండా ఇతరత్రా ఆటంకాలకు కారణాలవుతాయి.
► చెడు భావాలను పెంచే, పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించడం వలన మీరు సోషల్ మీడియాలో ప్రతికూల అనుభవాన్ని పొందే అవకాశం ఉంది.
► ఇప్పటికే మన నిజ జీవితంలో ఎంతో పోటీని ఎదుర్కొంటున్నాం. ఆన్‌లైన్ ప్రపంచంలో మనకు అంతకన్నా ఎక్కువ పోటీ అవసరం లేదని గుర్తించాలి.
► ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలని మీరు కోరుకుంటున్నారో, మీ సోషల్ మీడియా కార్యకలాపాల ఆధారంగా ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారో కూడా ఇది ప్రతిబింబిస్తుంది.
► సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇష్టపడని వారు మీ జాబితాలో ఉండవచ్చు. మీరు అలాంటి వారితో పూర్తిగా డిస్‌కనెక్ట్ అయ్యారనే విషయాన్ని నిర్ధారించుకోండి.
► ఆన్‌లైన్ ప్రపంచంలో విహరిస్తూ మీ ప్రియమైన వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు.. మీ పుట్టినరోజున 100 లైక్‌లు పొందవచ్చు. కానీ, మీ ఇంట్లో ఒక స్నేహితుడు మాత్రమే మిమ్మల్ని కలిసి అభినందనలు చెప్పచ్చు.
► స్మార్ట్‌ఫోన్ లకు బదులుగా సోషల్ మీడియా ఖాతాలకు లాగిన్ అవ్వడానికి ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం మేలు. ఎందుకంటే ఇది వ్యసనంగా మారే అవకాశాన్ని తగ్గిస్తుంది.
– అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment