సాక్షి, అమరావతి: ప్రజల వ్యక్తిగత సమాచారంతో చంద్రబాబు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. టీడీపీ శ్రేణులను ప్రజల ఇళ్లలోకి పంపించి.. వారి వివరాల్ని సేకరిస్తున్నారు. మభ్యపెట్టి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాకుండా.. దాన్ని లండన్‌లోని సర్వర్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా ప్రజల భద్రతకు పెనుముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఇలా చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినా.. చంద్రబాబు మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు.
ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో..
ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ఇంటింటికీ వెళుతున్న టీడీపీ కార్యకర్తలు ఓటరు పేరు, ఓటరు కార్డు నంబర్, కులం, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆ కుటుంబంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల పిల్లల సంఖ్య, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సంఖ్య, కుటుంబంలోని నిరుద్యోగ సభ్యులు, కుటుంబంలోని మహిళల సంఖ్య, మొబైల్ నంబర్, ఆ తర్వాత ఓటీపీ కూడా సేకరిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ ఒక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అవన్నీ వెంటనే వారి వెబ్ అప్లికేషన్ టీడీపీ మేనేఫెస్టో.కామ్‌లో నిక్షిప్తమవుతున్నాయి.
ఆ వెబ్‌సైట్ సర్వర్ లొకేషన్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉండటం విశేషం. అంటే ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఆ దేశానికి టీడీపీ తరలిస్తున్నట్టు స్పష్టమైంది. గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారం అంతా నెట్టింట్లో పెట్టడం ద్వారా వారి వ్యక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలిగించేలా టీడీపీ వ్యవహరిస్తోంది. ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలన్నింటినీ తమ వెబ్‌సైట్‌కి అనుసంధానం చేసుకుని రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ముప్పు కలిగించేందుకు సైతం సిద్ధపడింది.
చట్టవిరుద్ధంగా ఓటీపీల సేకరణ
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే క్రమంలో చట్టవిరుద్ధంగా వారి ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీని సైతం టీడీపీ కార్యకర్తలు సేకరిస్తున్నారు. యాప్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేశాక, వారి ఫోన్ నంబర్లు తీసుకుని యాప్ నుంచి జనరేట్ అయ్యే ఓటీపీని అడుగుతున్నారు. ఓటీపీ ఇవ్వడానికి ఎవరైనా నిరాకరిస్తే.. వారిని బలవంతం చేస్తూ ఇబ్బంది పెడుతున్న ఘటనలు కూడా పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని ఓ మహిళా టీడీపీ కార్యకర్త ఒక ఇంట్లోకి వెళ్లి వారి వ్యక్తిగత వివరాలు సేకరించి మొబైల్ ఓటీపీ తీసుకోవడంతో గొడవ జరిగింది. ఓటీపీ తీసుకోవడం పట్ల స్థానికులు అభ్యంతరం చెప్పడంతో టీడీపీ కార్యకర్తలు వారిపై దౌర్జన్యానికి దిగారు. ఈ విషయంలో టీడీపీ నేతలు శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి సైతం వెనుకాడటం లేదు.
అబద్ధాలతో వివరాల సేకరణ
ఈ వివరాలన్నీ ఎందుకు సేకరిస్తున్నారో ప్రజలకు టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఓటర్ల వెరిఫికేషన్ ముసుగులో ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నా వాస్తవానికి అవన్నీ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమం కింద చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు ప్రకటించిన పథకాలకు ఎంపికయ్యారంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.
కానీ.. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడంలో దిట్ట కావడంతో ప్రజలు వారి మాటలను నమ్మడం లేదు. దీంతో వారు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ఆ వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇలా వివరాలు నమోదు చేసిన ప్రతి పౌరుడి పేరుతో టీడీపీ మేనేఫెస్టో.కామ్‌లో ఒక డ్యాష్‌బోర్డ్ పేజీని రూపొందిస్తున్నారు. ఇలా ప్రజల ఫోన్ నంబర్లను యాప్‌కు లింకు చేసి ప్రజల వ్యక్తిగత సమాచారం అంతటినీ లండన్‌లోని సర్వర్‌లో భద్రపరుస్తున్నారు.
ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇతర దేశాల్లోని సర్వర్లలో దాన్ని ఉంచడం ముప్పని తెలిసినా.. టీడీపీ అదే పనిని నిర్విఘ్నంగా చేస్తోంది. వన్‌టైమ్ పాస్‌వర్డ్ సేకరించడం ద్వారా ఆర్థిక లావాదేవీలతో సహా వివిధ ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో టీడీపీ కార్యకర్తలు ఇళ్లల్లోకి చొరబడి ఓటీపీ నంబర్ల కోసం ఒత్తిడి చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment