సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్ల దోపిడీకి అడ్డులేకుండా పోతోంది. కొత్త దారుల్లో బ్యాంక్ అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. బడా కంపెనీల ఈ–మెయిళ్ల, వెబ్‌సైట్లను సైతం హ్యాక్ చేసి సమాచారాన్ని కొట్టేస్తున్నారు. మరోవైపు ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత విషయాల కూపీ లాగుతున్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోని ఫోన్ నంబర్ల సేకరించి టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బయోమెట్రిక్, అడ్రస్ డేటా చౌరంతో స్విమ్ స్వాప్ చేసి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు.
విశాఖకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సిమ్ పని చేయకపోవడంతో వేరే నంబర్ నుంచి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. అప్పటికే అతడి పేరిట అదే నంబర్‌తో వేరే వ్యక్తులు కొత్త సిమ్ తీసుకున్నట్టు తేలడంతో షాకయ్యాడు. అదే సమయంలో అతని అకౌంట్ నుంచి రూ.2 లక్షలు మాయమయ్యాయి. బ్యాంకు అకౌంట్ చూసుకుంటే గానీ అతనికి అసలు విషయం తెలియలేదు. సిమ్ పనిచేయకపోవడంతో ఎస్‌ఎంఎస్ కూడా రాలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాజమండ్రికి చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫోన్‌లో సిగ్నల్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఫోన్ ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి.. ఆన్ చేసినా సిగ్నల్స్ రాలేదు. సమీపంలోని కస్టమర్ సెంటర్‌కు వెళ్లి విషయం చెప్పాడు. సిమ్‌కార్డు పాడైందని.. కొత్తది తీసుకోవాలన్నారు. అడ్రస్ ప్రూఫ్ తీసుకుని ఆన్‌లైన్‌లో చెక్ చేసిన సిబ్బంది అంతకు ముందే అదే నంబర్‌తో కొత్త సిమ్ యాక్టివేట్ అయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ అకౌంట్‌లో రూ.20 వేలు డ్రా అయ్యాయి. ఈ రెండు ఘటనల్లో జరిగింది సిమ్ స్వాప్. సైబర్ నేరగాళ్లు నకిలీ సిమ్ తీసుకుని.. బ్యాంకు అకౌంట్లను గుల్ల చేసే కొత్త ఎత్తుగడ ఇది. ఇటీవల కాలంలో పల్లెలు, పట్టణాల్లోనూ సిమ్ స్వాప్ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి.
ఇలా కొట్టేస్తున్నారు
♦ సిమ్ స్వాప్ నేరాలకు పాల్పడే సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి ఫోన్ నంబర్‌తో అతనికి తెలియకుండానే మరో సిమ్‌కార్డు తీసుకుంటున్నారు.
♦ నేరగాళ్లు ముందుగానే బాధిత వ్యక్తి అడ్రస్, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి వివరాలను సంపాదిస్తున్నారు.
♦ వాటి ఆధారంగా సిమ్‌కార్డు పోయిందంటూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుంటారు.
♦ఆ విషయం అసలు వ్యక్తికి తెలిసేలోపే ఆ ఫోన్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును అదే ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు.
♦ ఇందుకోసం ఫేక్ కాల్స్, ఫిషింగ్ మెసేజిల ద్వారా కస్టమర్ వ్యక్తిగత వివరాలను కూపీ లాగుతున్నారు.
♦ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి హైటెక్ దోపిడీకి పాల్పడుతున్నారు.
వీటిని తరచూ గమనించాలి
♦ మీ సిమ్ కార్డ్ లేదా ఫోన్ నంబర్ వేరేచోట యాక్టివేట్ అయిందంటే అది సిమ్ స్వాప్‌గా గుర్తించాలి.
♦ ఏ కారణం లేకుండా ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు ఉన్నట్టుండి నిలిచిపోతే దోపిడీకి ఆస్కారం ఏర్పడినట్టు గ్రహించాలి.
♦ తరచూ భద్రతా నోటిఫికేషన్‌లు, పాస్‌వర్డ్‌లు, భద్రతా ప్రశ్నలు వంటివి, మీ ప్రొఫైల్ డేటా మార్పుల గురించి హెచ్చరికలు వస్తే.. సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్‌లోకి లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని అర్థం.
♦ సైబర్ నేరస్తులు మీ సిమ్‌ను నకిలీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మీరు సందర్శించే వెబ్‌సైట్ల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
♦ భద్రత ప్రమాణాలు కలిగిన వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌లో https:// అని ఉంటుంది. యూఆర్‌ఎల్‌లో ‘ S ’ లేకుంటే అది కచ్చితంగా నకిలీ వెబ్‌సైట్ అని భావించాలి.
వ్యక్తిగత డేటా విషయంలో జాగ్రత్త
సిమ్ స్వాపింగ్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన వ్యక్తిగత డేటా ఎప్పుడూ బహిరంగ పరచకూడదు. భద్రతా ప్రమాణాలు కలిగిన వెబ్‌సైట్‌లనే వినియోగించాలి. సామాజిక మాధ్యమాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు వంటి వాటిని పిన్‌లుగా పెట్టకపోవడం మంచిది. తరచూ మీ సిమ్ మీ పేరుపైనే ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఒక్కసారిగా మెసేజ్‌లు ఆగిపోవడం, సిగ్నల్ నిలిచిపోవడం, మీ అకౌంట్‌కు అవాంఛనీయ మెయిల్స్ రావడం సిమ్ స్వాప్‌కు సూచనలు. రెండంచెల ధ్రువీకరణ కోరే యాప్స్‌ను మాత్రమే వాడటం మంచింది. సిమ్ స్వామ్ జరిగినట్టు తెలిసివెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 112, 181, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 11100, నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. – అమిత్ బర్దర్, ఎస్పీ, సైబర్ క్రైమ్
Comments
Please login to add a commentAdd a comment