వాషింగ్టన్ : ఓ వైపు ఎన్నికల సీజన్ హడావుడి.. మరోవైపు హ్యకర్ల తెగింపు.. 200 మంది ప్రస్తుత, మాజీ కాంగ్రెస్ డెమొక్రాట్ల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి. డెమొక్రాట్ నేతల సెల్ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని హాకర్లు బయటపెట్టారు. గుసిఫర్ 2.0 హ్యాకర్ల గ్రూపు ఈ సెన్సిటివ్ రికార్డులను పబ్లిక్ గా తీసుకొచ్చింది. డెమొక్రాటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ నుంచి ఈ ఫైల్స్ను దొంగతనం చేసినట్టు ఆ హ్యాకర్ల గ్రూపు వెల్లడించింది. తమ హ్యాకర్ల వెబ్సైట్లో డెమొక్రటిక్ నేతల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్లను పొందుపరిచినట్టు తెలిపింది.
ఈ హ్యాకర్ల పోస్టు చేసిన సమాచారంలో అమెరికా ప్రతినిధుల సభకు మైనారిటీ లీడర్గా వ్యవహరిస్తున్న నాన్సీ పెలోసీ, హౌస్ డెమొక్రాటిక్ విప్ స్టెనీ హోయర్ల సెల్ఫోన్ వివరాలు కూడా ఉన్నాయి. అయితే తన వ్యక్తిగత సమాచారం దొంగతనం చేసినట్టు కానీ, ఆన్లైన్లో పోస్టు చేసినట్టు కానీ తనకు తెలియదని హోయర్ తెలిపారు. వైట్ హౌస్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి తిరస్కరించారు. హ్యాకర్లు పోస్టు చేసిన సమాచారమంతా సరియైనది కాదని డెమొక్రాట్లు చెబుతున్నారు. ఈ వివరాలు బయటపెట్టడం జాతీయ భద్రతా పరమైన చిక్కులకు తెరతీస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే రష్యన్ మిలటరీ ఇంటిలిజెన్స్ ఏజెన్సీతో కలిసి, హ్యకర్ గ్రూపు ఈ కుట్రపూరిత చర్యకు పాల్పడినట్టు రీసెర్చర్లు విశ్వసిస్తున్నారు.
డెమొక్రాట్ల వ్యక్తిగత వివరాలు బహిర్గతం
Published Sat, Aug 13 2016 1:44 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
Advertisement