ఏఐను తలదన్నే హ్యాకింగ్ టూల్స్!
మైక్రోసాఫ్ట్, మెటా సహా ఎన్నో గ్లోబల్ కంపెనీల సర్వర్లూ హ్యాక్
81 శాతం కంపెనీలు సొమ్ములతో సెటిల్ చేసుకుంటున్న తీరు
ఈ ముప్పుపై అంతర్జాతీయ కంపెనీల ఫోకస్.. సైబర్ సెక్యూరిటీకి భారీగా నిధులు
డేటా సెక్యూరిటీ, రెసిలెన్స్ సంస్థ ‘వీమ్’ అధ్యయనంలో వెల్లడి
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అద్భుతాలు సృష్టించే కృత్రిమ మేధోశక్తి (ఏఐ) గుప్పిట్లో ఉన్నా.. సైబర్ దొంగల ‘చోరకళ’ మాత్రం ఆ సంస్థలను భయపెడుతూనే ఉంది. ఏఐతో సమానంగా పనిచేస్తూ, డేటాను దొంగిలించే టూల్స్‌ను వారు రూపొందిస్తున్నారు. ఏఐతో దూసుకుపోతున్న బహుళ జాతి ఐటీ కంపెనీలు డేటా సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధమవడం గమనార్హం. ప్రముఖ డేటా సెక్యూరిటీ, రెసిలెన్స్ సంస్థ ‘వీమ్’ఇటీవల సైబర్ దాడులపై చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
సైబర్ దొంగల చేతుల్లో గ్లోబల్ డేటా..
వీమ్ అధ్యయనం ప్రకారం..2023లో మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ ఏఐ వంటి పలు గ్లోబల్ సంస్థలు కూడా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కాయి. వారు ర్యాన్సమ్‌వేర్‌ను తేలికగా ఆయా సంస్థల సర్వర్లలోకి పంపారు. కొన్ని కంపెనీల డేటా బ్యాకప్, రికవరీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకున్నారు. కంపెనీల నిర్వహణ, రహస్య సమాచారం, వ్యాపార లావాదేవీల డేటాను చోరీ చేశారు. సర్వర్లను ఎన్‌క్రిప్ట్ చేశారు. ఇలా సైబర్ దాడులకు గురైన సంస్థల్లో 81 శాతం కంపెనీలు చేసేదేమీ లేక, సైబర్ నేరస్తులకు గుట్టుచప్పుడు కాకుండా సొమ్మును ముట్టజెప్పాయని తేలింది. ఇలా డబ్బులు ఇచ్చినా కూడా మూడింట ఒకవంతు సంస్థలు, వ్యక్తులు డేటాను తిరిగి పొందలేకపోయారని అధ్యయనంలో తేలింది. 45 కోట్ల వినియోగదారులున్న మైక్రోసాఫ్ట్..5.5 కోట్ల కస్టమర్ల డేటానే పూర్తిస్థాయిలో తిరిగి పొందగలిగిందని నివేదిక పేర్కొంది. అంతపెద్ద కంపెనీలే నిస్సహాయ స్థితికి వెళ్తుంటే..పరిస్థితి ఏమిటని వీమ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
ఎదురవుతున్న సవాళ్లు..
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ కృత్రిమ మేధతో పనిచేయడం అనివార్యమైంది. అన్ని సంస్థలూ ఇందుకోసం టూల్స్‌ను సమకూర్చుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు, ఈ–కామర్స్, స్మార్ట్ సిటీలు, ప్రత్యేక క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున డిజిటల్ డేటాను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరస్తులూ అప్‌డేట్ అవుతున్నారు. ఏఐ ఆధారిత మాల్‌వేర్లు, వైరస్‌లను రూపొందిస్తున్నారు. వాటితో కంపెనీల సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఏఐని అభివృద్ధి చేస్తున్న మేధావులే ఈ వినాశకర శక్తుల జాబితాలోనూ ఉంటున్నారని అంతర్జాతీయ సైబర్ సంస్థలు అంటున్నాయి. ‘ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ విధానాలపై, సైబర్ సెక్యూరిటీ చైన్ లింక్’పై అధ్యయనం చేసిన వారే సైబర్ దాడుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని పేర్కొంటున్నాయి.
ఇదీ చదవండి: కొత్త అప్‌డేట్.. యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!
రక్షణ వ్యవస్థలపై ఫోకస్
ఏఐ ఆధారిత వ్యవస్థలను రక్షించే విధానాలపై కంపెనీలు ఫోకస్ చేశాయి. ప్రతీ కంపెనీ దీనిపై కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేయాలని, పరిశోధన విధానాలను ప్రతీ కంపెనీలు అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డేటా స్టోరేజీ గతం కన్నా భిన్నంగా ఉంటోందని..ఇందుకోసం మైక్రో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పేర్కొంటున్నారు.
సైబర్ నేరాల లెక్కలివీ..
వరల్డ్ సైబర్ క్రైం ఇండె క్స్– 2024 ప్రకారం.. సైబర్ నేరాల ఆనవాళ్లు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి.
ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గ్లోబల్ సైబర్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025 నాటికి ఏటా 10 ట్రిలియన్ డాలర్లకు పైగా సైబర్ నేరాలపై ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
సైబర్ నేరాలు గడచిన 11 ఏళ్లలో 15.63 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు స్టాటిస్టా సర్వే చెబుతోంది. ఇది 2029 నాటికి మూడు రెట్లు పెరిగే వీలుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment