చైనాకు చెందిన హ్యాకర్లు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఇండియాతోపాటు ఇతర దేశాలకు చెందిన గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని దొంగలించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. చైనా ప్రభుత్వం మద్దతున్న ఓ హ్యాకింగ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు ఇటీవల లీకయ్యాయి. ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు కథనాలు వెలువడ్డాయి.
సాఫ్ట్‌వేర్ లోపాలతో..
విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు అందులో తేలింది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ వ్యవస్థల్లో లోపాలను ఉపయోగించుకుని ఈ దాడులు చేసినట్లు తెలిసింది. గతవారం గిట్‌హబ్‌లో లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసూన్ అనే కంపెనీకి చెందినవని సమాచారం. చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీ హ్యాకింగ్ సేవలు అందిస్తోంది.
20 దేశాలు టార్గెట్..
ఇతర దేశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేలా సైబర్ దాడులకు పూనుకునేలా చైనా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. భారత్, యూకే, తైవాన్, మలేషియాతోపాటు మొత్తం 20 దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అందులో ఉంది. అయితే ఈ పత్రాల లీక్‌కు ఎవరు బాధ్యులో కనుగొనేందుకు చైనా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..?
ఏం చేశారంటే..
హ్యాకర్ల నుంచి లీకైన పత్రాల ద్వారా తెలిసిన సమాచరం ప్రకారం కథానాల్లో వెలువడిన వివరాలు ఇలా ఉన్నాయి.. భారత్ నుంచి 100 గిగాబైట్ల(జీబీ) ఇమిగ్రేషన్ డేటాను సేకరించారు. హ్యాకర్లు వివిధ దేశాల్లోని 80 టార్గెట్ల నుంచి డేటాను దొంగలించారు. దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్ నుంచి 3 టెరాబైట్ల(టీబీ) కాల్ లాగ్స్ సమాచారాన్ని సేకరించారు. దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment