ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతాలు..! | Cyber Attackers Maintain Hundreds Of Sims And Bank Accounts Each | Sakshi
Sakshi News home page

ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతాలు..!

Published Sat, Mar 16 2024 9:30 AM | Last Updated on Sat, Mar 16 2024 12:40 PM

Cyber Attackers Maintain Hundreds Of Sims And Bank Accounts Each - Sakshi

పెరుగుతున్న సైబర్‌ నేరాలు

ఏఐ సాయంతో చెక్‌ పెట్టేలా పోలీసుల కసరత్తు

ఇప్పటికే సిమ్‌ కార్డుల సర్వీస్‌ ప్రొవైడర్లు అప్రమత్తం
 

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు అధికమవుతున్నాయి. సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీసులు కృత్రిమ మేధను వాడుతున్నారు. దీని ద్వారా అనుమానిత సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి బ్లాక్‌ చేయించి.. సైబర్‌ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలనేది వారి ఆలోచన. టెలికాం, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అండతో నేరాలకు పాల్పడుతున్నవారికి అదే ఆయుధంతో చెక్‌ పెట్టనున్నారు.

ప్రత్యేక ముఠాలు ఏర్పాటు

సైబర్‌ నేరాలు ఇటీవలి కాలంలో అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇవి సామాన్యులనే కాదు పోలీసులనూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మోసాల బారిన పడకుండా ప్రజలను ఎన్ని రకాలుగా చైతన్యపరుస్తున్నా.. నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి మరీ.. ఇక్కడి వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్‌ కాల్‌తో బురిడీ కొట్టించి.. ఖాతాలో ఉన్న సొత్తు అంతా ఊడ్చేస్తున్నారు. తప్పుడు చిరునామాలతో సిమ్‌కార్డులు తీసుకొని, బోగస్‌ ఖాతాల్లోకి డబ్బు మళ్లించి.. కొల్లగొడుతున్నారు. ఒక్కో నేరగాడు వందల సంఖ్యలో సిమ్‌కార్డులు సమకూర్చుకుంటున్నాడు. సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా ముఠాలే ఉన్నాయి. నిరక్షరాస్యులు, నిరుద్యోగులను నమ్మించి.. బ్యాంకు ఖాతా వాడుకునేందుకు అనుమతి ఇస్తే మంచి కమీషన్‌ ఇస్తామని ఆశపెడుతున్నారు. బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును ఈ ఖాతాల్లోకి, వాటిలో నుంచి వేరే ఖాతాలోకి మార్చి.. డ్రా చేసుకుంటున్నారు.

కష్టమ్మీద ఆచూకీ కనిపెట్టినా..

నేరగాళ్ల ఆచూకీని పోలీసులు అతికష్టమ్మీద కనిపెట్టినా ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేరగాళ్లు వాడుతున్న సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను గుర్తించి.. వాటిని రద్దు చేయించగలిగితే వారిని కట్టడి చేయచ్చని అధికారులు భావిస్తున్నారు. సిమ్‌కార్డు లేకపోతే మోసం చేసేందుకు కాల్‌ చేయలేరు. బ్యాంకు ఖాతా లేకపోతే మళ్లించిన డబ్బు దోచుకోలేరు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్ల సిమ్‌కార్డులను అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 28,610 సిమ్‌కార్డులను బ్లాక్‌ చేయించగలిగారు. వాటిని వాడిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్‌ను గుర్తించి, వాటిని కూడా బ్లాక్‌ చేయిస్తున్నారు. దాదాపు 2 వేల బ్యాంకు ఖాతాలనూ రద్దు చేయించారు. తమకు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే ఇవన్నీ చేయించారు.

ప్రక్షాళన షురూ..

సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను ముందుగానే గుర్తించేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ)కు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయి. బాధితులకు వచ్చిన ఫోన్‌ కాల్స్‌, డబ్బు మళ్లించిన బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఇక్కడ నమోదవుతుంటాయి. ఈ సమాచారంతోపాటు బ్యాంకింగ్‌ డేటా ఆధారంగా అనుమానాస్పద ఖాతాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం కృత్రిమమేధ సాయం తీసుకోనున్నారు.

ఇదీ చదవండి: బెంట్లీ కార్లను ఎలా టెస్ట్‌ చేస్తారో తెలుసా..?

చాలాకాలంగా పనిచేయని బ్యాంకు ఖాతాలోకి ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అయినా, ఒక ఖాతాలోకి దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి డబ్బు జమ అవుతున్నా అటువంటి వాటిని గుర్తించి, ఆయా బ్యాంకులను అప్రమత్తం చేయనున్నారు. అలాగే సిమ్‌కార్డుల విషయంలో సర్వీస్‌ ప్రొవైడర్లను ఇప్పటికే అప్రమత్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement