
సామాజిక మాధ్యమాల్లోని డేటా లీక్ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియా యూజర్ల వ్యక్తిగత సమాచారం ఎంత సేఫ్‌గా ఉందనే ప్రశ్నలు హడలెత్తిస్తున్న పరిస్థితుల్లో అగ్నికిఆజ్యం పోసినట్లుగా నేనేమన్నా తక్కువనా అన్నట్లు గూగుల్ తోడయింది. మనం ప్రతీ చిన్న విషయానికి ఆధారపడే ‘గూగుల్’ కూడా మన ప్రతి కదలికను డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నట్టు, మనకు సంబంధించిన ప్రతీ అంశాన్ని భద్రపరుస్తున్నట్టు వెల్లడైంది. ఆయా సందర్భాలు, యాప్‌లను ఉపయోగించినపుడు, మనం రోజూ మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో నిర్వహించే కార్యకలాపాలు, ఇలా అన్ని విషయాలు గూగుల్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌లలో రికార్డవుతున్నట్టు తేలింది.
అంతా గూగుల్ కనుసన్నల్లోనే...
మీరు మీ మొబైల్ ఫోన్‌ను తెరిచిన ప్రతీసారి మీరెక్కడ ఉన్నారో తెలిసిపోతుంది! మీ ఫోన్లో గూగుల్ యాప్‌ను ఉపయోగించడం మొదలుపెట్టిన తొలిరోజు నుంచి ఇప్పటివరకు ఎక్కడెక్కడికి వెళ్లారో తేదీలతో సహా ‘టైమ్‌లైన్’లో రికార్డయి ఉంటుంది. గూగుల్‌లో సెర్చ్ చేసిన ప్రతీ అంశం.. హిస్టరీ సహా ఫోన్ డేటా హిస్టరీని తొలగించినా (డిలీట్) ,ఒకవేళ పాతఫోన్ మార్చినా, ఆ తర్వాత మరిన్ని ఫోన్లు మార్చినా ఆ సమాచారమంతా కూడా సేవ్ అయ్యే ఉంటుంది. యూట్యూబ్‌లో ఏమేమీ వీక్షించారు ? మీరు ఎలాంటి వారు ? మీరు ప్రగతిశీలురా కాదా ? ఏ మతానికి చెందినవారు ?త్వరలోనే తండ్రి లేదా తల్లి కాబోతున్నారా ? యూట్యూబ్‌లో చూసిన వీడియోలు, కంటెంట్ హిస్టరీతో పాటు ఈ వివరాలన్నీ కూడా గూగుల్ వద్ద నిక్షిప్తమై ఉంటాయి. ఇలా మీకు సంబంధించిన పూర్తి సమాచారమంతా మీకు తెలియకుండానే గూగుల్ వద్ద గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్న విషయం మీకు తెలుసా..?
మీకు సంబంధించిన సమాచారం (ఎక్కడున్నారు, స్త్రీ/పురుషుడు, వయసు, హాబీలు, ఎలాంటి కెరీర్‌లో ఉన్నారు, వివాహితులా/ సింగిలా, బరువెంత, ఆదాయమెంత)తో అడ్వర్టయిజ్‌మెంట్ ప్రొఫైల్ కూడా గూగుల్ వద్ద ఉంటుంది. అంతేకాదు మీరు ఏయే యాప్‌లను, ఎప్పుడెప్పుడు, ఎందుకు ఉపయోగిస్తున్నారో, వాటి ద్వారా ఏయే దేశాలకు చెందినవారితో సంభాషిస్తున్నారో, ఏ టైమ్‌లో నిద్రపోతున్నారన్నది కూడా గూగుల్‌కు తెలుసు. గూగుల్ ఫిట్ యాప్ ద్వారా మీరెన్ని అడుగులు వేసారు, ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లారు. యోగాతో పాటు ఎలాంటి ధ్యానం, వ్యాయామ పద్ధతులు పాటిస్తారో తెలిసిపోతుంది. మీ ఫోన్‌లో తీసిన ఫోటోల రికార్డంతా కూడా ఉంటుంది. గూగుల్ సెర్చ్‌లో భాగంగా మీరు వెతికిన అంశాలు, చదివిన వ్యాసాలు వంటివన్నీ కూడా నమోదై ఉంటాయి.
ఫేస్‌బుక్కవుతారు..
అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో మీరు ఎక్కడి నుంచి ఏ టైమ్‌లో ఏ సాధనం (మొబైల్, లాప్‌టాప్, డెస్క్‌టాప్) ద్వారా లాగిన్ అయ్యారు (లాగిన్ అయిన ప్రతీసారి)...మీకు నచ్చిన విషయాలు అలవాట్లు...మిత్రులతో ఏయే అంశాలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు ? మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఏయే అప్లికేషన్లను కనెక్ట్ చేసుకున్నారు ? మీ ఇష్టాయిష్టాలేమిటీ ? వంటి సమాచారం దొంతరలు, దొంతరలుగా ఫేస్‌బుక్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. మీకు సంబంధించిన డేటాను కలెక్ట్ చేయడమే కాకుండా మీరెక్కడున్నారో, మీరు ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్లను దేని కోసం ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకుంటారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ వెబ్‌కామ్‌ను, మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేయగలరు.
మీ కాంటాక్ట్స్ వివరాలు, మీ ఈమెయిళ్లు, మీ కేలండర్, కాల్‌డేటా హిస్టరీ, మీరు పంపించే, మీకు వచ్చే మెసేజ్‌లు, ఏ ఫైల్స్ డౌన్‌లోడ్ చేశారు, ఏ గేమ్‌లు ఆడతారు ? మీ ఫోటోలు, వీడియోలు, మీరు వినే సంగీతం, ఏయే రేడియోస్టేషన్లు వింటారు ? సెర్చ్ హిస్టరీ, బ్రౌజింగ్ హిస్టరీ ఇలా మొత్తం వివరాలన్నీ ఈ మాధ్యమాల గుప్పిట్లో బందీ అయ్యి ఉన్నాయి. మీ లాగిన్ లోకేషన్‌తో సహా మీ కంపెనీ సెల్‌ఫోన్ ఉపయోగిస్తారు, దాని నెంబర్‌తో పాటు మొబైల్ ఫోన్‌లో మీరెక్కడ ఉన్నది తెలియజేసే ‘లోకేషన్’ను ఆన్‌చేస్తే చాలు మీరెక్కడెక్కడికి వెళ్లింది గూగుల్‌లో స్టోర్ అయిపోతుంది.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment