సాక్షి, న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ‘పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు–2019 (పీడీపీ)’ ముసాయిదాకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఉభయ సభల ముందుకు రానుంది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబర్‌లో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి పలు మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోపత్య కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నా అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆనాడు ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు నివేదించారు.
దీనిపై పలువురు విపక్ష ఎంపీలు తమ అసమ్మతి తెలుపుతూ జేపీసీ చైర్మన్ చౌదరికి లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, వివేక్ టాంకా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా, బిజూ జనతాదళ్ ఎంపీ అమర్ పట్నాయక్ జేపీసీ నిర్ణయంతో విభేదించారు. వేర్వేరుగా తమ అసమ్మతి నోట్‌లను ప్యానెల్ ఛైర్మన్‌కు పంపారు.
ఏదైనా నేరం జరిగే ఆస్కారం ఉందని భావించినా దాన్ని నిరోధించడానికి, ఆ విషయంలో తదుపరి దర్యాప్తు చేయడానికి, సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడానికి వ్యక్తిగత డాటాను విశ్లేషించే అధికారాన్ని ఈ చట్టంలో దర్యాప్తు సంస్థలకు వీలు కల్పించారు. ఈడీ, సీబీఐలతో సహా తమ దర్యాప్తు సంస్థలకు వ్యక్తిగత గోప్యత రక్షణ హక్కు చట్టం నుంచి మినహాయించే అపరిమిత అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడాన్ని విపక్షాలు తీవ్రం ఆక్షేపించాయి. ఇలా మినహాయింపు ఇవ్వడానికి పార్లమెంటు ఆమోదం తీసుకోవాలని, అప్పుడే సిసలైన జవాబుదారీతనం ఉంటుందని విపక్షాలు కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు.
చట్టం స్ఫూర్తికే దెబ్బ..
కమిటీ సిఫార్సుల్లో రెండు మినహా మిగతా అంశాలపై అభ్యంతరం లేదని జైరాం రమేశ్ పేర్కొన్నారు. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో సంబంధాలు, శాంతిభద్రతలకు సంబంధించి కేంద్రం, ప్రభుత్వ ఏజెన్సీలు తమని తాము మినహాయించుకోవడానికి అనుమతించే బిల్లులోని క్లాజ్ 35ను పలువురు విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ చట్టం నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ చట్టబద్ధ సంస్థలకు(పోలీసులు, సీబీఐ, ఈడీ, రా, ఐబీ, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) మినహాయింపు లభించనుంది.
ట్విట్టర్, ఫేసుబుక్ వంటి వాటిని సామాజిక ప్రసార మాధ్యమ వేదికలుగానే పరిగణించాలని తేల్చిచెప్పింది. వాటికి మధ్యవర్తిత్వ హోదా (ఇంటర్మీడియటరీ హోదా... ఎవరైనా వినియోగదారుడు సదరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకమైన అంశాలను పోస్టు చేసే వాటికి ఈ సోషల్ మీడియా సంస్థ బాధ్యత ఉండదు) తొలగించి వాటిని సైతం ఈ చట్టం కిందికి తీసుకురావాలని సూచించింది. బిల్లులోని క్లాజ్ 35 ప్రకారం.. పౌరుల అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత డేటాను ప్రభుత్వం, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విశ్లేషించవచ్చు. ఐటీ శాఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా మినహాయింపు ఇవ్వాలని జేపీసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment