- ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే యోచన
- అధికారులతో సీఎం సంప్రదింపులు.. న్యాయశాఖ సలహాకు ఫైలు
సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ రెండు బిల్లులను అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్ష జరిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశాలను పరిశీలించడంతో పాటు బిల్లులకు సంబంధించిన అంశాల పరిశీలనకు న్యాయ శాఖతోనూ సంప్రదిం పులు జరుపుతున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.
ఈలోగా బిల్లుల రూపకల్పనతో పాటు సర్క్యూలేషన్ పద్ధతిలో మంత్రివర్గ ఆమోద ముద్ర వేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2007లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన 14 ముస్లిం వర్గాలను బీసీ–ఇ కేటగిరీలో చేర్చింది. వీరికి 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీ లు, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ప్రత్యేకంగా నియమించిన విచారణ కమిషన్ న్యాయపరమైన సలహాలతో పాటు చట్టసభల ఆమోదం పొందేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని నివేదికలో ప్రస్తావించింది.
న్యాయ నిపుణుల సలహాతో తమిళనాడులో అమలులో ఉన్న చట్టానికి అనుగుణంగా ముస్లిం రిజర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించాలని సూచించింది. మరోవైపు సుధీర్ కమిషన్ నివేదికలోని అంశాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీఎస్ రాములు బీసీ కమిషన్ పరిశీలనకు అప్పగించారు. ముస్లింలతో పాటు ప్రస్తుతం ఎస్టీలకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్‌ను 12 శాతంకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఎస్టీల స్థితిగతులపై ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ చెల్లప్ప ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపుపై కసరత్తు చేస్తోంది.