సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీడియా సమావేశాన్ని అసాధారణ అంశంగా న్యాయ నిపుణులు పేర్కొన్నారు. దీని వెనుక ఏదో బలమైన కారణాలు ఉండవచ్చని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో న్యాయ వ్యవస్థ విశ్వసనీయతపై సందేహలు తలెత్తాయని కొందరు న్యాయ కోవిదులు ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాదులు కేటీఎస్ తులసీ, న్యాయ శాఖ మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, అశ్వనీ కుమార్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎస్ సోధీ, జస్టిస్ ముకుల్ ముద్గల్‌లు ఆందోళన వెలిబుచ్చగా.. సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ ఈ పరిణామాల్ని ఆహ్వానించడంతో పాటు, మీడియా సమావేశం నిర్వహించిన నలుగురు న్యాయమూర్తుల్ని అభినందించారు.
‘ఈ పరిణామం జరిగి ఉండాల్సింది కాదు. ఇప్పుడు న్యాయమూర్తులు రాజనీతి విజ్ఞతను ప్రదర్శించి, విభేదాలు తొలగి పోయేలా చూడాలి. న్యాయమూర్తుల మధ్య పరస్పర అవగా హన కొనసాగేలా చేయాలి. న్యాయవాదులుగా మేమిదే కోరుకుంటున్నాం’. – సీజేఐతో భేటీ అనంతరం అటార్నీ జనరల్ వేణుగోపాల్
సీనియర్ న్యాయవాదులుగా డబ్బు సంపాదించగల అవకాశమున్నా వృత్తి జీవితాన్ని వారు త్యాగం చేశారు. వారిని మనం గౌరవించాలి. ప్రెస్ కాన్ఫరెన్స్‌తో ఆ న్యాయమూర్తులు ముందుకు వచ్చినప్పుడు.. తప్పుపట్టకుండా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముంది. ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలి. సంప్రదింపులతో ఈ విషయం పరిష్కారమయ్యేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు న్యాయమూర్తులతో ప్రధాని మాట్లాడాలి. – సుబ్రహ్మణ్య స్వామి, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ
ఆ నలుగురు న్యాయమూర్తులు చాలా బాధ్యత కలిగినవారు. వారు ఈ విధంగా చేయడమంటే.. తప్పకుండా పరిస్థితి అదుపు తప్పి ఉండాలి. కేసుల కేటాయింపు విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన అధికార పరిధిని దుర్వినియోగం చేస్తున్నారని వారు చెప్పారు. – ప్రశాంత్ భూషణ్, సీనియర్ న్యాయవాది
న్యాయవ్యవస్థలో ఇది చీకటి రోజు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశం చెడు సంప్రదాయానికి దారితీయవచ్చు. ఇక నుంచి న్యాయవ్యవస్థలోని అన్ని తీర్పుల్ని సామాన్య పౌరుడు అనుమానాస్పద దృష్టితో చూడవచ్చు. ప్రతి తీర్పును ప్రశ్నించవచ్చు.– ఉజ్జ్వల్ నికమ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
మీడియా సమావేశం నిర్వహించడం మినహా ఏ ఇతర ప్రత్యామ్నాయం లేనంత తీవ్రమైన విషయం ఆ నలుగురు న్యాయమూర్తుల వద్ద ఉండొచ్చు. వారు ప్రచారం కోసం పాకులాడే న్యాయమూర్తులు కాదు. అనవసర ప్రచారం కోసం అర్రులు చాచరు. లోయాకు ఈ అంశంతో సంబంధం ఏంటి? నాకైతే ఏమీ తెలియదు. – ముకుల్ ముద్గల్, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి
ఈ అంశంలో నేను చాలా కలత చెందా. ఇది జరిగి ఉండకూడదు. అయితే జరిగింది.. వారి వద్ద ఏదో బలమైన కారణం ఉండవచ్చు. ఈ పరిణామం ప్రజల మనసుల్లో ఆందోళన కలిగించే అవకాశముంది. – ఏకే గంగూలీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి
ఈ పరిణామంతో నేను చాలా నిరాశ చెందా.. నలుగురు సుప్రీం జడ్జీలు ఇలా చేయకూడదు. ఇది న్యాయ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.– సోలీ సొరాబ్జీ, మాజీ అటార్నీ జనరల్
ఇది చరిత్రాత్మకం.. ఆ నలుగురు న్యాయమూర్తుల్ని నేను అభినందిస్తున్నా. వారితో నేను ఏకీభవిస్తున్నా. ఈ పరిణామం మెచ్చుకోదగింది. సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం ఉండాలి. – ఇందిరా జైసింగ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
న్యాయవ్యవస్థలోని అంతర్గత సమస్యను ఇలా బహిరంగంగా చర్చించ డం సరికాదు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను నలుగురు న్యాయమూర్తులు అనవసరంగా మీడియా ముందుకు తీసుకు వచ్చారు. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసేలా వారు ప్రవర్తించారు. –సంతోష్ హెగ్డే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
చదవండి: 'సుప్రీం' సంక్షోభం
Comments
Please login to add a commentAdd a comment