పన్నీర్ సెల్వం రాజీనామా వెనక్కి తీసుకోవచ్చా?
పన్నీర్ సెల్వం రాజీనామా వెనక్కి తీసుకోవచ్చా?
Published Tue, Feb 14 2017 2:20 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం గతవారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠ పోరాటం నుంచి శశికళ ఔట్ అయ్యారు. ఇక ఆ పోస్టుకు పన్నీర్ సెల్వం ఒక్కరే మిగిలారు. కానీ పన్నీర్పై పట్టువదలని శశికళ తాను జైలుకు వెళ్తూ కూడా తన వర్గం నుంచి కొత్తవ్యక్తి పళనిస్వామిని రంగంలోకి దింపారు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని సంకేతాలు ఇస్తున్నారు. అయితే పన్నీర్ సెల్వం లీగల్గా తన రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని పరిస్థితుల్లో రాజీనామాను వెనక్కి తీసుకోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. మొత్తం మూడు రకాల పరిస్థితుల్లో గవర్నర్, ముఖ్యమంత్రి రాజీనామా విత్డ్రాను ఆమోదించవచ్చని కొందరు మాజీ జడ్జిలు పేర్కొంటున్నారు.
మోసం, బలవంతం లేదా అనుచిత ప్రభావంతో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తే, దాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదురుతుందని తెలుస్తోంది. అయితే సంబంధిత వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో నిరూపించుకోవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు తెలుపుతున్నారు. పన్నీర్ సెల్వం కూడా తనను బలవంతం మీద ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని నిరూపించుకోవాలని మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి ఒకరు చెప్పారు.
అయితే శశికళ వర్గంలోని ఓ వ్యక్తిని అధికార పార్టీకి కొత్త నేతగా ఎన్నుకుంటే, ఆ సమయంలో మెజార్టిని ఇరు వర్గాలు నిరూపించుకునేందుకు గవర్నర్ పిలుపునిచ్చే అవకాశముంటుందని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే పరిస్థితి నెలకొంది. శశికళ వర్గం పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ విషయంపై గవర్నర్ ఏం చెబుతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇదే పరిస్థితి 1984 ఎన్ టీ రామారావును ముఖ్యమంత్రిగా తొలిగిస్తూ నాదెళ్ల భాస్కర్ రావును సీఎంగా నియమించిన సందర్భంలో ఎదురైంది. సీఎం పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటు చేసిన రోజు తనని బలవంతంగా రాజీనామా చేపించినట్టు పేర్కొన్నారు.
Advertisement
Advertisement