సాక్షి, హైదరాబాద్: న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరమని, దీనికి పరిధి అంటూ లేదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) చైర్మన్ ఆదిశ్ సి.అగర్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భేటీలు జరిగినప్పుడే ఒకరి ఆలోచనలు మరొకరికి, ఒక దేశంలోని న్యాయవ్యవస్థ తీరు ఇతరులకు తెలుస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ న్యాయ నిపుణుల భేటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
దీని కోసం తెలంగాణ బార్ అసోసియేషన్‌లో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ చైర్మన్ పల్లె నాగేశ్వర్‌రావుతో శనివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 50 మంది న్యాయమూర్తులతోపాటు దేశంలోని హైకోర్టుల నుంచి 50 మంది న్యాయమూర్తులు హాజరవుతారన్నారు. ఈ సమావేశాల్లో న్యాయవాదుల భద్రత చట్టంపై చర్చ జరగనుందన్నారు. ఇప్పటికే కర్ణాటక, రాజస్తాన్‌ల్లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని.. త్వరలో తెలంగాణలో కూడా ఇది వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతోనే సమావేశాలు నడుస్తాయని, సీఎం కేసీఆర్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అగర్వాల్ తెలిపారు.
న్యాయవాదుల సంక్షేమానికి సీఎం కృషి : న్యాయవాదుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ మొత్తంతో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పారు. అంతర్జాతీయ సమావేశ నిర్వహణకు పలు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ వేదిక కావడం సంతోషకరమని పల్లె నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ మాజీ చైర్మన్ పొ న్నం అశోక్‌గౌడ్, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, కె.ప్రదీప్‌రెడ్డి, కోశాధికారి వెంగల పూర్ణశ్రీ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ బైరెడ్డి, కార్యవర్గ సభ్యులు నాగులూరి క్రిష్ణకుమార్ గౌడ్, చైతన్య లత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment