SCBA
-
న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరం
సాక్షి, హైదరాబాద్: న్యాయనిపుణుల మధ్య సత్సంబంధాలు అవసరమని, దీనికి పరిధి అంటూ లేదని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) చైర్మన్ ఆదిశ్ సి.అగర్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భేటీలు జరిగినప్పుడే ఒకరి ఆలోచనలు మరొకరికి, ఒక దేశంలోని న్యాయవ్యవస్థ తీరు ఇతరులకు తెలుస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ న్యాయ నిపుణుల భేటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం తెలంగాణ బార్ అసోసియేషన్‌లో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ చైర్మన్ పల్లె నాగేశ్వర్రావుతో శనివారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 50 మంది న్యాయమూర్తులతోపాటు దేశంలోని హైకోర్టుల నుంచి 50 మంది న్యాయమూర్తులు హాజరవుతారన్నారు. ఈ సమావేశాల్లో న్యాయవాదుల భద్రత చట్టంపై చర్చ జరగనుందన్నారు. ఇప్పటికే కర్ణాటక, రాజస్తాన్‌ల్లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని.. త్వరలో తెలంగాణలో కూడా ఇది వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతోనే సమావేశాలు నడుస్తాయని, సీఎం కేసీఆర్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అగర్వాల్ తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి సీఎం కృషి : న్యాయవాదుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని బీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ మొత్తంతో ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పారు. అంతర్జాతీయ సమావేశ నిర్వహణకు పలు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినా, తెలంగాణ వేదిక కావడం సంతోషకరమని పల్లె నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ మాజీ చైర్మన్ పొ న్నం అశోక్‌గౌడ్, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, కె.ప్రదీప్‌రెడ్డి, కోశాధికారి వెంగల పూర్ణశ్రీ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ బైరెడ్డి, కార్యవర్గ సభ్యులు నాగులూరి క్రిష్ణకుమార్ గౌడ్, చైతన్య లత తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ లేఖను ఖండిస్తూ మీ తీర్మానం సరికాదు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) చేసిన తీర్మానాన్ని ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్రంగా తప్పుపట్టారు. సైద్ధాంతికపరంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బార్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి రోహిత్ పాండేకు స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా ఓ వర్తమానాన్ని ఆయనకు పంపారు. ఈ తీర్మానంలో భాగస్వామిని కావడానికి తాను తిరస్కరిస్తూ వచ్చానని, తీర్మానం విషయంలో జరిగిన సంప్రదింపుల్లోనూ పాల్గొనలేదని తేల్చిచెప్పారు. ‘వైఎస్ జగన్ ఆరోపణల్లో యధార్థత గురించి మనకు ఏమీ తెలియదు. ఓసారి విచారణ జరిగితే వాస్తవం అదే బయటకు వస్తుంది. ఈ దశలో మనం విచారణను ముందుకెళ్లకుండా అడ్డుకోజాలం. ప్రస్తుతం సీఎం ఫిర్యాదును ఖండిస్తూ తీర్మానం చేయడం అపరిపక్వమే అవుతుంది. సుప్రీంకోర్టు ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకుని, వాటి నుంచి అది నిష్కళంకంగా బయటపడలేదు. పూర్తి పారదర్శకత లేని వ్యవస్థ న్యాయవ్యవస్థేనన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. తప్పు చేసిన జడ్జీలపై ఎన్నడూ చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించలేదు’ అని దుష్యంత్ దవే కుండబద్దలు కొట్టారు. ఇంకా ఆయన పాండేకు పంపిన తన వర్తమానంలో ఏమన్నారంటే.. అరుణాచల్ సీఎం ఇద్దరు జడ్జీల పేర్లను ఆత్మహత్య లేఖలో పేర్కొన్నా.. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి కలికోపాల్ తన ఆత్మహత్య లేఖలో ఇద్దరు జడ్జీల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ తర్వాత వారిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులయ్యారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నా.. వాటిపై సుప్రీంకోర్టు తన ఇష్టమొచ్చినట్లు విచారణ జరిపి, ఆ ఆరోపణల నుంచి ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది. ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగిని డిస్మిస్ చేసి తప్పుడు క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయించారు. అయినా న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రేక్షకపాత్ర పోషించారు. రోజూ కోర్టులో అసంతృప్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఎవరూ గొంతెత్తడం లేదు. న్యాయవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సీఎం వైఎస్ జగన్ ఆరోపణలను తప్పకుండా పరిశీలించాల్సిందే.. సీఎం జగన్ ఫిర్యాదు విషయంలోనే దుష్యంత్ దవే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం రాసిన లేఖ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందులోని ఆరోపణలను పరిశీలించే అవకాశమిచ్చింది. అంతేకాకుండా న్యాయమూర్తుల ప్రవర్తనపై వచ్చే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని న్యాయవ్యవస్థకు ఇచ్చిందన్న విషయాన్ని గమనించాలి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి.. మరో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు వాటిని తప్పకుండా పరిశీలించాల్సిందే. ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసే స్వతంత్ర వ్యక్తి ఆ ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందన్న విషయాన్ని సులువుగా తేల్చగలరు. ఇదంతా చాలా పారదర్శకంగా జరగాలి. ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారనే అనుకుంటున్నా.. ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా. జాతి, న్యాయవ్యవస్థ ప్రయోజనాలను, స్వతంత్రతను దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నా. మిగిలిన విషయాల్లా దీన్నీ పక్కన పడేస్తారని అనుకోను. నేను కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకం. తన నియామకాలను తానే చేపట్టడం ప్రారంభించిన నాటి నుంచి న్యాయవ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. అత్యుత్తములు, ప్రతిభావంతులు, స్వతంత్రులైన వారిని నియమించకుండా కేవలం సీనియారిటీ ఆధారంగా న్యాయమూర్తుల నియామకాలు జరిగాయి. సరైన కారణాలతోనే జగన్ లేఖ రాసి ఉంటారు.. న్యాయవ్యవస్థ తన స్వీయ హస్తాల్లో మరింత బలంగా, స్వతంత్రంగా ఉండాలి. అందులో న్యాయవ్యవస్థ విఫలమైతే ప్రజాస్వామ్యం విఫలమైనట్లే. వైఎస్ జగన్ వివేకం కలిగిన రాజకీయ నేతగా, ఒక రాష్ట్ర సీఎంగా సరైన కారణాలతోనే లేఖ రాసి ఉంటారు. చాలా ఆలోచించాకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. -
‘తీర్పు ఇవ్వడానికి జడ్జిలకు మనసుండాలి’
న్యూఢిల్లీ: కేవలం మెదడుతో చేసే పనివల్ల న్యాయమూర్తులు ప్రజలకు న్యాయం చేయలేరనీ, వారికి మనసుండాలనీ, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్ దవే అన్నారు. బుధవారం జరిగిన జస్టిస్ వి.గోపాల గౌడ వీడ్కోలు సభలో ఆయన ఈ మాటలన్నారు. గోపాల గౌడ మనసుతో తీర్పులిచ్చిన న్యాయమూర్తి అని ప్రశంసించారు. కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ (ఎస్సీబీఏ) నిర్వహించింది. జస్టిస్ గౌడ మాట్లాడుతూ రైతుల హక్కులను పరిరక్షించాలని యువ న్యాయవాదులను కోరారు. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే రైతులే కారణమనీ, నష్టాలు వస్తున్నా ఏ ప్రతిఫలం ఆశించకుండా తిండి గింజలు పండిస్తున్న అన్నదాతలకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన ఇతర న్యాయమూర్తులను అభ్యర్థించారు. 2012లో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చిన గౌడ బుధవారం పదవీ విరమణ చేశారు.