సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్‌సీబీఏ) చేసిన తీర్మానాన్ని ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్రంగా తప్పుపట్టారు. సైద్ధాంతికపరంగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బార్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి రోహిత్ పాండేకు స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా ఓ వర్తమానాన్ని ఆయనకు పంపారు. ఈ తీర్మానంలో భాగస్వామిని కావడానికి తాను తిరస్కరిస్తూ వచ్చానని, తీర్మానం విషయంలో జరిగిన సంప్రదింపుల్లోనూ పాల్గొనలేదని తేల్చిచెప్పారు. ‘వైఎస్ జగన్ ఆరోపణల్లో యధార్థత గురించి మనకు ఏమీ తెలియదు. ఓసారి విచారణ జరిగితే వాస్తవం అదే బయటకు వస్తుంది. ఈ దశలో మనం విచారణను ముందుకెళ్లకుండా అడ్డుకోజాలం. ప్రస్తుతం సీఎం ఫిర్యాదును ఖండిస్తూ తీర్మానం చేయడం అపరిపక్వమే అవుతుంది. సుప్రీంకోర్టు ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకుని, వాటి నుంచి అది నిష్కళంకంగా బయటపడలేదు. పూర్తి పారదర్శకత లేని వ్యవస్థ న్యాయవ్యవస్థేనన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. తప్పు చేసిన జడ్జీలపై ఎన్నడూ చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఎప్పుడూ పారదర్శకంగా వ్యవహరించలేదు’ అని దుష్యంత్ దవే కుండబద్దలు కొట్టారు. ఇంకా ఆయన పాండేకు పంపిన తన వర్తమానంలో ఏమన్నారంటే..
అరుణాచల్ సీఎం ఇద్దరు జడ్జీల పేర్లను ఆత్మహత్య లేఖలో పేర్కొన్నా..
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి కలికోపాల్ తన ఆత్మహత్య లేఖలో ఇద్దరు జడ్జీల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ తర్వాత వారిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులయ్యారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నా.. వాటిపై సుప్రీంకోర్టు తన ఇష్టమొచ్చినట్లు విచారణ జరిపి, ఆ ఆరోపణల నుంచి ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగిని డిస్మిస్ చేసి తప్పుడు క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయించారు. అయినా న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రేక్షకపాత్ర పోషించారు. రోజూ కోర్టులో అసంతృప్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఎవరూ గొంతెత్తడం లేదు. న్యాయవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై మనం ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
సీఎం వైఎస్ జగన్ ఆరోపణలను తప్పకుండా పరిశీలించాల్సిందే..
సీఎం జగన్ ఫిర్యాదు విషయంలోనే దుష్యంత్ దవే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం రాసిన లేఖ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందులోని ఆరోపణలను పరిశీలించే అవకాశమిచ్చింది. అంతేకాకుండా న్యాయమూర్తుల ప్రవర్తనపై వచ్చే ప్రశ్నలకు సమాధానమిచ్చే ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని న్యాయవ్యవస్థకు ఇచ్చిందన్న విషయాన్ని గమనించాలి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి.. మరో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు వాటిని తప్పకుండా పరిశీలించాల్సిందే. ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసే స్వతంత్ర వ్యక్తి ఆ ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందన్న విషయాన్ని సులువుగా తేల్చగలరు. ఇదంతా చాలా పారదర్శకంగా జరగాలి.
ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారనే అనుకుంటున్నా..
ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నా. జాతి, న్యాయవ్యవస్థ ప్రయోజనాలను, స్వతంత్రతను దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తున్నా. మిగిలిన విషయాల్లా దీన్నీ పక్కన పడేస్తారని అనుకోను. నేను కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకం. తన నియామకాలను తానే చేపట్టడం ప్రారంభించిన నాటి నుంచి న్యాయవ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. అత్యుత్తములు, ప్రతిభావంతులు, స్వతంత్రులైన వారిని నియమించకుండా కేవలం సీనియారిటీ ఆధారంగా న్యాయమూర్తుల నియామకాలు జరిగాయి.
సరైన కారణాలతోనే జగన్ లేఖ రాసి ఉంటారు..
న్యాయవ్యవస్థ తన స్వీయ హస్తాల్లో మరింత బలంగా, స్వతంత్రంగా ఉండాలి. అందులో న్యాయవ్యవస్థ విఫలమైతే ప్రజాస్వామ్యం విఫలమైనట్లే. వైఎస్ జగన్ వివేకం కలిగిన రాజకీయ నేతగా, ఒక రాష్ట్ర సీఎంగా సరైన కారణాలతోనే లేఖ రాసి ఉంటారు. చాలా ఆలోచించాకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment