కడప కోటిరెడ్డి సర్కిల్: తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు కడప స్టేషన్ వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్యే అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈ రైలును పొడిగించాలని కడప, రాజంపేట మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పలుసార్లు పార్లమెంటులో చర్చించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను వీరు స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దక్షిణ మధ్య రైల్యే బోర్డు మీటింగ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలును పొడిగించాలని పట్టుపట్టారు.
అందుకు స్పందించిన కేంద్ర మంత్రి, దక్షిణ మధ్య రైల్వేబోర్డు అధికారులు కడప వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును ఎట్టకేలకు పొడిగించారు. ఈ రైలు విశాఖనుంచి బయలు దేరి కడపకు రానుంది. ఈ రైలు రాకతో రాజధాని ప్రయాణికులకు కష్టాలు తీరనున్నాయి. ఫిబ్రవరి 1 సాయంత్రం 5.5 గంటలకు కడప నుంచి రైలు బయలుదేరి తిరుపతికి వెళ్లి అటునుంచి విశాఖకు బయలుదేరుతుంది. నిన్నటి వరకు ప్రయాణికులు విజయవాడకువెళ్లాలంటే ధర్మవరం–విజయవాడ రైలును ఆశ్రయించాల్సి వచ్చేది. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,నంద్యాల మీదుగా వెళ్లాల్సి వచ్చేది. వారానికి 3రోజులు మాత్రమే ఈ రైలు నడుస్తోంది దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు విశాఖ–తిరుమలఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజు నడుస్తుంది కాబట్టి రాజధానికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
అభినందనీయం..
కడప నుంచి రాజధాని మీదుగా రైలు సౌకర్యం కల్పించడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా నుంచి రాజధానికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే వారన్నారు. ఈ క్రమంలో అనేకమార్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి కడపనుంచి రాజధానికి నేరుగా ఏదో ఒక మార్గంలో రైలు సౌకర్యం కల్పించాలని కోరామన్నారు.
సమయం ఇలా..
విశాఖ–కడప ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా తిరుపతికి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి 5.20 గంటలకు బయలుదేరి రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు మీదుగా 8.25 గంటలకు కడప రైల్వేస్టేషన్‌కు వస్తుంది. ప్రతి రోజు సాయంత్రం 5.05 గంటలకు కడప స్టేషన్‌లో బయలుదేరి తిరుపతికి రాత్రి 8.00 గంటలకు చేరుకుంటుంది. అక్కడినుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ద్వారాపూడి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, దువ్వాడ, విశాఖపట్నంకు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది. మాజీ ఎంపీలకు, దక్షిణ మధ్య రైల్యే అధికారులకు జిల్లాలోని ప్రయాణికులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment