
సాక్షి, బేల(ఆదిలాబాద్ ): మండలంలోని సదల్‌పూర్ రెవెన్యూ గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో పిడుగుపాటుతో గురువారం ఇద్దరు మహిళ కూలీలు మృతిచెందారు. వీరిలో ఒకరు రైతు కుటుంబం కాగా, మరోకరిది కూలీ కుటుంబం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సదల్‌పూర్ గ్రామ శివారులోని రైతు రేషవార్ ఆశన్న పత్తి చేనులో బేల, జూనోని గ్రామాల నుంచి 8 మంది మహిళ కూలీలు ఆటోలో పత్తి ఏరడానికి వెళ్లారు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వీరంతా చెట్ల కిందకు పరుగెత్తారు. దీంతో ఒక చెట్టుకు కిందకు వెళ్లిన నలుగురు పిడుగుపాటుకు గురయ్యారు. జూనోనికి చెందిన నాగోసే ప్రమీల(33), బేలకు చెందిన కనక దేవిక(29)లు అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన జూనోని గ్రామానికి చెందిన మరో ఇద్దరు లెన్‌గురే ఉష, నాగోసే దుర్పతలను రిమ్స్‌కు తరలించారు. వీరు ప్రస్తుతం కోలుకుంటున్నారు. సంఘటన స్థలాన్ని ఏఎస్సై నజీబ్ పరిశీలించారు. ఆయన వెంట కానిస్టేబుల్ స్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment