మృతుడు సుభాష్(ఫైల్)
సాక్షి, రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : కష్టపడి చదివాడు..కన్నవారి కలలు నిజం చేశాడు. మామూలు వైద్యుడి కంటే ఏకంగా ‘గుండె’ డాక్టరే(కార్డియాలజిస్ట్) అయ్యాడు. కాలక్రమంలో అతనిలో ‘ప్రేమ’ అనే మరో కల మొగ్గలు తొడిగింది. చివరికి పెళ్లి దాకా వెళ్లింది. ఏ ప్రేమ కోసమైతే అతడు ఆరాటపడ్డాడో అదే ‘ప్రేమకల’ చెదిరిపోయింది. ఆ వైద్యుడి గుండె శాశ్వతంగా ఆగిపోయింది. రామకృష్ణాపూర్‌లో విషాదం నింపిన ఘటన వివరాలివి.. పట్టణంలోని ఠాగూర్ స్టేడియం ఏరియాకు చెందిన దాసారాపు సుభాష్(34) గురువారం రాత్రి హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రిటైర్ కార్మికుడు ఆగయ్య కుమారుడైన సుభాష్ మెడిసిన్‌కు ఎంపికయ్యాడు. అరుదైన గుండె విభాగంలో స్పెషలైజేషన్ పూర్తిచేశాడు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే సుభాష్ హైదరాబాద్‌లో తానుంటున్న ఇంటిలోనే విషపు ఇంజక్షన్ వేసుకుని విగతజీవుడయ్యాడు.
మనస్తాపంతోనే ఈ దారుణం
మృతుడు సుభాష్ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే చెన్నైకి చెందిన నిత్య అనే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త పెళ్లి వరకు వెళ్లింది. 2017లో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. సాఫీగా వీరి దాంపత్య జీవితం గడుస్తు న్నా నిత్య తల్లిదండ్రులకు మాత్రం వీరి ప్రేమ వివా హం మింగుడు పడలేదు. 15 రోజుల క్రితం నిత్య తల్లి దండ్రులు హైదరాబాద్ వచ్చి ఆమెను చెన్నైకి తీసుకువెళ్లారు. కాగా అక్కడే మరో వ్యక్తితో పెళ్లి సంబంధం చూస్తున్నారన్న సమాచారం సుభాష్‌కు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. పెళ్లై రెండు సంవత్సరాలు దాటిపోయాక మరో సంబంధం చూడటం జీర్ణించుకోలేకనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలుస్తోంది.
అమ్మా.. నిద్రపోతానమ్మా..
‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నేను నిద్రపోతాను...’ అని చెప్పిన కొడుకు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవటం ఆ కన్నతల్లి పేగుల్ని పెకిలించివేసింది. గురువారం రాత్రి సుభాష్ నోట వచ్చిన పదాలే ఇక చివరి మాటలవుతాయని తల్లి మల్లమ్మ ఏ కోశాన ఆలోచించలేదు. ఉదయం పూట డ్యూటీకి టైం అవుతుందని లేపుదామని వెళ్లిన తల్లి కొడుకు విగతజీవుడయ్యాడని తెలిసి కుప్పకూలిపోయింది. ఎందరో పేషెంట్ల గుండెకు వైద్యం చేసిన తన కొడుకు నిజజీవితంలో ‘గుండె నిబ్బరాన్ని’ కోల్పోయాడని కన్నీరుమున్నీరైంది. ఆగయ్య–మల్లమ్మల సంతానంలో మూడోవాడైన సుభాష్ మృతి స్థానికంగా విషాదం నింపింది. శుక్రవారం ఉదయం ఈ వార్త తెలిసి ఠాగూర్‌స్టేడియం ఏరి యా వాసులు పెద్ద ఎత్తున వారింటికి తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment