ఏమైపోయారో? | Girls And Women Missing cases In Adilabad | Sakshi
Sakshi News home page

ఏమైపోయారో?

Published Thu, May 2 2019 8:45 AM | Last Updated on Thu, May 2 2019 8:45 AM

Girls And Women Missing cases In Adilabad - Sakshi

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగిరావడం లేదు. నెలలు..సంవత్సరాలైన వారి జాడ తెలియడం లేదు. అసలు బతికున్నాడో..మరే ప్రమాదంలో చిక్కుకున్నాడో అంతుపట్టడం లేదు. ఇలా అదృశ్యమైన వ్యక్తుల్లో అధికంగా మహిళలే ఉంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తప్పిపోయిన వారి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. ఏళ్ల తరబడి వీరి జాడ తెలియక అయిన వా రు మానసిక వేదనకు గురవుతున్నారు. 

మంచిర్యాలక్రైం: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మిస్సింగ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తప్పిపోయిన వారిలో కొంతమంది ఆచూకీ దొరుకుతుండగా.. మరికొంత మంది ఏమైపోతున్నారో తెలియడం లేదు. 2016 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,502 మంది తప్పిపోగా ఆయా పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,502 మంది అదృశ్యం కాగా 1,379 మంది దొరికారు. ఇంకా 123 మంది ఆచూకీ లభించక ఆ కుటుంబాలు తీరని క్షోభను అనుభవిస్తున్నాయి. అదృశ్యమైన వారిలో చిన్నారుల నుంచి యువత వరకు ఉన్నారు. ఇందులో 18 ఏళ్లలోపు బాలబాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధిక శాతం మహిళా మిస్సింగ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. కారణమేదైనా జిల్లాలో మిస్సింగ్‌ కేసులు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. ఇటీవల భద్రాద్రి జిల్లాలోని హాజీపూర్‌ ఘటనతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

వివాహం చేసుకుంటున్నారు.. 
యువతుల మిస్సింగ్‌ కేసుల్లో చాలా మట్టుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నవే అధికంగా ఉంటున్నాయి. సాధారణంగా యువతులు ఆదృశ్యమైనప్పుడు వారి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెడుతుంటారు. ఇలాంటి చాలా కేసుల్లో యువత కొన్ని నెలల తర్వాత ప్రేమ వివాహం చేసుకొని జంటలుగా తిరిగివస్తున్నారు. యువతి మైనర్‌ తీరిన పక్షంలో ఆమె వాంగ్మూలం తీసుకొని ఆ కేసులను కొట్టివేస్తారు. కాగా మరికొంత మంది యువతుల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. వీరు కూడా ఏదైనా ప్రేమ వివాహం చేసుకున్నారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

మూడున్నర ఏళ్లలో మహిళల మిస్సింగ్‌ కేసులే అధికంగా నమోదవుతున్నాయి.  మొత్తం 1,502 మిస్సింగ్‌ కేసులు నమోదు కాగా, ఇందులో సుమారు 600లకుపైగా మహిళలు అదృశ్యమయ్యారు. కొందరుల ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని తిరిగి వచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఇలా ఇందులో 500మంది ఆచూకీ లభించింది. ఇంకా 100 మంది మహిళల ఆదృశ్యం మిస్టరిగానే మిగిలిపోయింది. ఏదేమైనా చేతికందిన పిల్లలు కనిపించకుండా పోతున్నారనే బాధ తల్లిదండ్రులను వేధిస్తోంది. ఒక వేళా అదృశ్యమై పెళ్లిళ్లు చేసుకున్నా ఇంటికి రాకుండా బయటనే ఉండే పిల్లల గురించి తెలియక తల్లితండ్రులు.. వారు ఏమయ్యారనే ఆవేదనకు గురవుతున్నారు.

పిల్లల అక్రమ రవాణా..
ఉమ్మడి జిల్లాలో అదృశ్యమైన కేసులను బట్టి చూస్తే మనుషుల అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుసుస్తోంది. అదృశ్యమైన 18 ఏళ్లలోపు పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో చిన్న పిల్లలను అపహరించడమే లక్ష్యంగా కొన్ని ముఠాలు ఇటీవల తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పసి పిల్లలకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. బాలబాలికల్లో కొంతమంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంతోనే ఇంటిని విడిచి వెళ్లిపోగా.. మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి కార్మిక పనులు చేస్తున్నట్లు సమాచారం.

ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్, ఉట్నూర్, కెరమెరి, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్‌ వంటి పట్టణాల నుంచి మనుషుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. అదృశ్యమైన మహిళలను రాజస్థాన్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి కొంత మందిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ తిరిగి వదిలేయడం, మరికొంత మందిని వ్యభిచార గృహాలకు తరలించడం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అమాయక మహిళలకు డబ్బు ఏరగా వేసి ఇలాంటి పడుపు రొంపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్లలో మిస్సింగ్‌ కింద నమోదు చేసిన చాలా కేసుల్లో ఇంకా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. చిన్నపిల్లలు అదృశ్యమై ఎంత వెతికినా దొరకని కేసులపై సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

మచ్చుకు కొన్ని సంఘటనలు

æ మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌ నగర్‌కు చెందిన ఓ బాలిక( 18) తమకు  ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉచుకొని దగ్గరి బందువైన ఓ యువకునికి తెలిసిన వారి ఇంట్లో పని చేసేందుకని 2014 డిసెంబర్‌ 21న హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సదరు యువతి, యువకుడు కనిపించకుండా పోయారు.  కొంత కాలం వేతికి ఎక్కడ ఆచుకి లభించకపోవడంతో పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు  చేశారు.  
æ 2018 అక్టోబర్‌ 14న మంచిర్యాల గోదావరిలో రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని కుళ్లిపోయిన మృతదేహం లభించింది. తలకు తీవ్రమైన గాయం ఉండడంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 6 నెలలు అవుతున్న మృతి చెందిన వ్యక్తి ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఎవరు హత్య చేసి ఉంటారు అనేది ఇంక మిస్టరీగానే మిగిలిపోయింది. 

మిస్సింగ్‌ కేసులపైదృష్టి సారిస్తాం
జిల్లాలో మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. మంచిర్యాల జిల్లాలోని పోలీస్‌ అధికారులతో సమావేశమై ఈ కేసులపై చర్చిస్తాం. ఇప్పటికే సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అన్ని కేసుల్లో దృష్టి సారిస్తున్నారు. మిస్సింగ్‌ కేసుల్లో పురోగతి సాధించేందుకు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోనూ, జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో సమాచారం అందించి చర్యలు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లాలో మహిళల అక్రమ రవాణా ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీçసులకు సమాచారం అందించాలి. 100 కాల్‌ చేస్తే పోలీసులు క్షణాల్లో ఘటన స్థలానికి చేరుకుంటారు. – రక్షిత కే మూర్తి, డీసీపీ, మంచిర్యాల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement