మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ సత్యనారాయణ మృతుడు కిరణ్‌బాబు (ఫైల్)
రెబ్బెన(ఆసిఫాబాద్): అవసరం నిమిత్తం తీసుకున్న రూ.5వేల అప్పే ఆ యువకుడిని తనువు చాలించేలా చేసింది. అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తాళలేక యువకుడు పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకోగా శనివారం వెలుగులోకి వచ్చింది. రెబ్బెన ఎస్సై దీకొండ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన బొడ్డు కిరణ్‌బాబు(20) స్థానికంగా ఉన్న జిరాక్స్ సెంటర్‌లో పని చేస్తుండేవాడు. అవసరం నిమిత్తం రూ.5వేలను మండల కేంద్రానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి రవితేజ వద్ద అప్పు తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం సకాలంలో చెల్లించడంలో విఫలం కావటంతో రవితేజ డబ్బుల కోసం అతడిని వేధించాడు.
ఈ క్రమంలో గత నెల 30న మోటర్‌సైకిల్‌పై వస్తున్న కిరణ్‌ను అడ్డగించి బైక్‌ను లాక్కోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశాడు. ఈ క్రమంలో కిరణ్ ఇంటికి వెళ్లిన రవితేజ కుటుంబ సభ్యుల ఎదుటే అసభ్య పదజాలంతో ధూషించి అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన కిరణ్ క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్కడి నుంచి మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కిరణ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారగా హైదరాబాద్‌కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. మృతుడి నానమ్మ వెంకటనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment