సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై హరిబాబు శుభం (ఫైల్) మునేశ్వర్ దినేశ్(ఫైల్)
ఆదిలాబాద్‌రూరల్: కార్యాలయ విధులు ముగించుకొని ఇంటికి వస్తున్నామని చెప్పిన యువకులు బైక్ అదుపు తప్పి దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై హరిబాబు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. బేల మండలకేంద్రానికి చెందిన జిలిపెల్లివార్ శుభం (25), అదే మండలం మనీయర్‌పూర్‌కి చెందిన తన మిత్రుడు మునేశ్వర్ దినేశ్ (27)తో కలిసి మంగళవారం శుభం ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్‌కు వచ్చారు. ఇద్దరు మిషన్ భగీరథలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో భగీరథపై జరిగిన సమావేశం ముగించుకొని బేలకు వస్తుండగా చాందా (టి) శివారు ప్రాంతంలోని వంతెన వద్ద బైక్ అదుపు తప్పి వంతెన కింద పడిపోయారని తెలుస్తోంది.
ఇద్దరి తలకు తీవ్రగాయాలుకావడంతో అక్కడిక్కడే మృతిచెందారు. బుధవారం అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులకు మృతదేహాలు కనిపించడంతో ఆరా తీయగా బేల మండల యువకులుగా గుర్తించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. శుభం తండ్రి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా ఇద్దరు యువకుల తల్లులు అంగన్‌వాడీ టీచర్లుగా పని చేస్తున్నారు. యువకుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే రామన్న సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment