నిందితులతో ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది
భీమారం(చెన్నూర్): తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న మంచిర్యాల జిల్లా భీమారం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై డి. కిరణ్‌కుమార్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దాసరి సంపత్, దాసరి రవి, దాసరి నరేందర్, తోటపల్లి ప్రశాంత్, దాసరి సన్నీ, కుంటల ప్రదీప్, దాసరి ప్రణీత్‌లు కలిసి వివిధ వ్యక్తుల పేర్లతో సిమ్ కార్డులు సేకరించి వాటితో మోసాలకు పాల్పడుతున్నారు. మే 22న ఒక దినపత్రికలో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఆసిఫాబాద్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తి ప్రకటనలో ఉన్న నంబర్‌కు కాల్ చేశాడు. నిందితులు అతనితో ఫోన్‌లో మాట్లాడి రుణం కావాలంటే ప్రాసెసింగ్ ఫీజ్ కింద రూ .25 వేలు వారి బ్యాంక్‌ఖాతాలో జమచేయాలన్నారు.
మహేష్ వెంటనే బ్యాంక్‌ఖాతాలో డబ్బు జమచేశాడు. నెలలు గడుస్తున్నా రుణం గురించి మాట్లాడకపోవడంతో మహేష్ మరోసారి వారికి కాల్ చేశాడు. కాని నిందితులు సెల్‌ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన మహేష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు వాడిన సెల్ నంబర్ ఆధారంగా సిగ్నల్స్ ప్రకారం నిందితులు రెడ్డిపల్లి గ్రామానికి చెందని వారుగా పోలీసులు నిర్ధారించారు. గాలించి మోసానికి పాల్పడిన 8 మంది యువకులను పట్టుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. సిబ్బంది మాచర్ల, దివాకర్, సంపత్, రవి, దశరత్, శివప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment