Debt Financing
-
అప్పు చెల్లించలేదని గృహ నిర్బంధం
కోవెలకుంట్ల: అప్పు తీర్చలేదని ఓ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేసిన ఘటన శనివారం నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జరిగింది. బొగ్గరపు చంద్రశేఖర్ స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట కిరాణాషాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన హోల్‌సేల్ వ్యాపారి రాధాకృష్ణ వద్ద కిరాణాషాపునకు సరుకులు అప్పుగా తీసుకున్నాడు. రెండు నెలల కిందట చంద్రశేఖర్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందాడు. తీసుకున్న సరుకులకు సంబంధించి రూ.60 వేలు చెల్లించకపోవడంతో వ్యాపారి గత కొన్ని రోజుల నుంచి మృతుడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నాడు. కుటుంబాన్ని పోషించే యజమాని మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు ఆ ఘటన నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో వ్యాపారి శనివారం వారి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులివ్వాలని వాగ్వాదానికి దిగాడు. మృతుడి భార్య గీతావాణి, అత్తమామలు సుబ్బరత్నమ్మ, రామసుబ్బయ్యను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. పోలీసులు వచ్చి వారిని విడిపించి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వారి మధ్య సయోధ్య కుదుర్చి సమస్యను తీర్చారు. -
సోలార్ రంగంలో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోసహా సౌర విద్యుత్ రంగంలో కార్పొరేట్ నిధులు అంచనాలను మించి వెల్లువెత్తుతున్నాయి. క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్స్, కన్సలి్టంగ్ కంపెనీ మెర్కమ్ క్యాపిటల్ గ్రూప్ ప్రకారం.. వెంచర్ క్యాపిటల్, పబ్లిక్ మార్కెట్, డెట్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలోకి 112 డీల్స్‌తో రూ.1,68,720 కోట్ల నిధులు వచ్చి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండడం విశేషం. 2020 జనవరి–సెపె్టంబర్లో 72 డీల్స్‌తో రూ.57,670 కోట్ల నిధులను ఈ రంగం అందుకుంది. 2010 తర్వాత పెట్టుబడుల విషయంలో ఈ ఏడాది ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్సింగ్ ద్వారా 23 డీల్స్‌తో రూ.46,620 కోట్ల నిధులు వచ్చి చేరాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు 39 డీల్స్ ద్వారా రూ.16,280 కోట్లు పెట్టుబడి చేశాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 466 శాతం వృద్ధి. కొనుగోళ్లు, విలీనాలు 83 నమోదయ్యాయి. -
రుణాల పేరిట ఘరానా మోసం
భీమారం(చెన్నూర్): తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న మంచిర్యాల జిల్లా భీమారం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై డి. కిరణ్‌కుమార్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దాసరి సంపత్, దాసరి రవి, దాసరి నరేందర్, తోటపల్లి ప్రశాంత్, దాసరి సన్నీ, కుంటల ప్రదీప్, దాసరి ప్రణీత్‌లు కలిసి వివిధ వ్యక్తుల పేర్లతో సిమ్ కార్డులు సేకరించి వాటితో మోసాలకు పాల్పడుతున్నారు. మే 22న ఒక దినపత్రికలో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఆసిఫాబాద్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తి ప్రకటనలో ఉన్న నంబర్‌కు కాల్ చేశాడు. నిందితులు అతనితో ఫోన్లో మాట్లాడి రుణం కావాలంటే ప్రాసెసింగ్ ఫీజ్ కింద రూ .25 వేలు వారి బ్యాంక్‌ఖాతాలో జమచేయాలన్నారు. మహేష్ వెంటనే బ్యాంక్‌ఖాతాలో డబ్బు జమచేశాడు. నెలలు గడుస్తున్నా రుణం గురించి మాట్లాడకపోవడంతో మహేష్ మరోసారి వారికి కాల్ చేశాడు. కాని నిందితులు సెల్‌ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన మహేష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు వాడిన సెల్ నంబర్ ఆధారంగా సిగ్నల్స్ ప్రకారం నిందితులు రెడ్డిపల్లి గ్రామానికి చెందని వారుగా పోలీసులు నిర్ధారించారు. గాలించి మోసానికి పాల్పడిన 8 మంది యువకులను పట్టుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. సిబ్బంది మాచర్ల, దివాకర్, సంపత్, రవి, దశరత్, శివప్రసాద్ ఉన్నారు. -
పత్రాలు ఇవ్వడానికి రూ.3 లక్షలు లంచం
అన్నానగర్ : ఇంటి పత్రాలను ఇవ్వడానికి రూ.3 లక్షలు లంచం అడిగిన తంజావూర్ సీఐపై శుక్రవారం సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఉంటున్న హాస్టల్ గదికి సీల్ వేశారు. వివరాలు.. తంజావూర్ పల్లియక్కిరకారకి చెందిన జోసఫ్ కుమారుడు అంథోనిస్వామి. జేసీబీ యంత్రాన్ని బాడుగకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. ఇతను తంజావూర్ మేలవీధిలో ఫైనాన్స్ సంస్థ నడుపుతున్న చంద్ర వద్ద 2016లో మూడు కంతుల వారీగా రూ.10.50 లక్షలు తీసుకున్నాడు. తన స్నేహితుల స్థలాలకు సంబంధమైన 4 దస్తావేజులను చంద్ర వద్ద అంథోనిస్వామి కుదువ పెట్టాడు. తరువాత అతను, అప్పుని కొద్ది కొద్దిగా వడ్డీతో చెల్లించాడు. వడ్డీతో కలిపి రూ.12.5 లక్షలు చెల్లించగానే తన దస్తావేజులను ఇవ్వమని అంథోనిస్వామి అడిగాడు. ఇంకా నగదు ఇస్తేనే దస్తావేజులను తిరిగి ఇస్తానని చంద్ర తెలిపాడు. దీంతో అంథోని స్వామి కొన్ని నెలల ముందు తంజావూర్ జిల్లా ఎస్పీ సెంథిల్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేయాలని తంజావూర్ నగర జాయింట్ పోలీసు సూపరింటెండెంట్‌కు పంపారు. అనంతరం పోలీసు సీఐ జ్యోతి మహాలింగం ఇరువర్గాల వారిని పోలీసు స్టేషన్‌కి పిలిపించి విచారణ చేశారు. రూ.1 లక్షతో ఇంకొక దస్తావేజుని చంద్ర వద్ద ఇవ్వాలని అంథోని వద్ద పలికాడు. చంద్ర వద్ద కుదువపెట్టిన 4 దస్తావేజులను సీఐ తీసుకున్నాడు. ఈ పత్రాలను తీసుకున్నట్లు అంథోని స్వామి వద్ద ఓ పేపర్‌పై సంతకం తీసుకున్నాడు. కానీ ఆ పత్రాలను అతనికి అప్పగించలేదు. పత్రాలు అడిగిన ఆంథోని స్వామిని తంజావూర్ పాత బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్(రూం నంబర్105)కి వచ్చి తీసుకొమ్మని సీఐ చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లిన అంథోని స్వామి సీఐని కలిశాడు. అప్పుడు అతను, పత్రాలను ఇవ్వడానికి లంచం కోరాడు. అంథోని స్వామి తన వద్ద ఉన్న రూ.50 వేల నగదు ఇచ్చాడు. దాన్ని తీసుకున్న సీఐ ఒక పత్రం మాత్రం ఇచ్చాడు. ఇంకా 3 పత్రాలు కావాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని అడిగాడు. లంచం ఇవ్వటానికి ఇష్టపడని అంథోని స్వామి తంజావూర్ సీబీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీబీఐ పోలీసులు అతని కదలికలు పర్యవేక్షించారు. శుక్రవారం తంజావూర్ పోలీసుస్టేషన్‌కి లంచం నిషేధ పోలీసులు వెళ్లి అక్కడ పనుల్లో ఉన్న పోలీసుల వద్ద విచారణ చేశారు. అప్పడు అంథోని స్వామి కుదువ పెట్టిన పత్రాలను సీఐ జ్యోతి మహాలింగం తీసుకున్నట్లు, దాన్ని అతనికి అప్పగించకుండానే సంతకం తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం సీఐ నివసించిన గదికి సీల్ వేశారు. సీఐ జ్యోతి మహాలింగంపై సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. -
యూబీ రుణాలపై డియాజియో దర్యాప్తు
ముంబై: యూబీ గ్రూప్ కంపెనీలకు యునెటైడ్ స్పిరిట్స్ అందించిన రుణాలపై దర్యాప్తునకు యూకే దిగ్గజం డియాజియో నిర్ణయించడంతో ఈ కంపెనీ షేరు 5% పతనమైంది. బీఎస్ఈలో యునెటైడ్ స్పిరిట్స్ రూ. 2,279 వద్ద ముగిసింది. ఒక దశలో దాదాపు 7% దిగజారి రూ. 2,226 వద్ద కనిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈలో 4% వరకూ క్షీణించి రూ. 2,300 వద్ద నిలిచింది. రెండు ఎక్స్ఛేంజీల్లోనూ కలిపి 2 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. డియాజియో ఇటీవల యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వెరసి గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలపై దర్యాప్తునకు యునెటైడ్ స్పిరిట్స్ బోర్డ్ ద్వారా తాజాగా ఆదేశించింది. కాగా, యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాను యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. నష్టాల నేపథ్యం గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో యునెటైడ్ స్పిరిట్స్ రూ. 4,489 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. వీటిలో రూ. 1,013 కోట్లను డౌట్ఫుల్ రుణాలుగా చూపించగా, స్కాటిష్ అనుబంధ సంస్థ వైట్ అండ్ మెకే విక్రయానికి సంబంధించి రూ. 3,236 కోట్ల ప్రత్యేక నష్టాన్ని యునెటైడ్ స్పిరిట్స్ నమోదు చేసింది. తాజాగా కంపెనీ బోర్డు ఈ అంశాలపై దర్యాప్తును చేపట్టనుంది. దీనిలో భాగంగా కంపెనీ అధికారులు, సలహాదారులను ప్రశ్నించనున్నట్లు డియాజియో తెలిపింది. పూర్తిస్థాయి అనుబంధ సంస్థలకు సంబంధించి 2013 మార్చి31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకూ ఉన్న రుణాలు, డిపాజిట్లు తదితర అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోనున్నట్లు కంపెనీ బోర్డ్ తెలిపింది.