లోపల పెట్టి ఇంటికి తాళం వేయడంతో బయటకు చూస్తున్న బాధితులు
కోవెలకుంట్ల: అప్పు తీర్చలేదని ఓ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేసిన ఘటన శనివారం నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జరిగింది. బొగ్గరపు చంద్రశేఖర్ స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట కిరాణాషాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన హోల్‌సేల్ వ్యాపారి రాధాకృష్ణ వద్ద కిరాణాషాపునకు సరుకులు అప్పుగా తీసుకున్నాడు.
రెండు నెలల కిందట చంద్రశేఖర్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందాడు. తీసుకున్న సరుకులకు సంబంధించి రూ.60 వేలు చెల్లించకపోవడంతో వ్యాపారి గత కొన్ని రోజుల నుంచి మృతుడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నాడు. కుటుంబాన్ని పోషించే యజమాని మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు ఆ ఘటన నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్నారు.
ఆ సమయంలో వ్యాపారి శనివారం వారి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులివ్వాలని వాగ్వాదానికి దిగాడు. మృతుడి భార్య గీతావాణి, అత్తమామలు సుబ్బరత్నమ్మ, రామసుబ్బయ్యను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. పోలీసులు వచ్చి వారిని విడిపించి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వారి మధ్య సయోధ్య కుదుర్చి సమస్యను తీర్చారు.
Comments
Please login to add a commentAdd a comment